Chandra Babu: చంద్రబాబు అరెస్ట్ అవుతారా? వైసీపీ ఎందుకంత ధీమాగా చెబుతోంది?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాక తప్పదంటున్నాయి వైసీపీ వర్గాలు. నిన్నటి నుంచి ఢంకా భజాయించి మరీ చెబుతున్నాయి. నిన్నటికి నిన్న ఏం జరిగింది? అనుకుంటున్నారా? సిట్‌పై హైకోర్టు స్టేను సుప్రీం తొలగించింది.
అసలు సిట్‌కు చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధం ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తక మానదు. ఏపీ విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగిందని వైసీపీ వాదన. రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. అప్పనంగా అయినవాళ్లకు టీడీపీ అందినకాడికి దోచి పెట్టిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ వేసింది. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే విధించింది. దీంతో సిట్ విచారణ నిలిచిపోయింది. నిన్న సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు అపరిపక్వ దశలో ఉండగానే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని.. కాబట్టి ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని సుప్రీం సూచించింది. మూడునెలల్లోగా ఆ పిటిషన్‌ను విచారించి హైకోర్టు తీర్పు చెప్పాలని సూచించింది. కాబట్టి మూడు నెలల్లో సిట్ విచారణ ప్రారంభం కావడం ఖాయమని.. ఆ వెంటనే చంద్రబాబు చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తాయని.. దీంతో చంద్రబాబు అరెస్ట్ ఖాయమని వైసీపీ చెబుతోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..