Ponguleti: పొంగులేటి పొలిటికల్ పయనంపై క్లారిటీ వచ్చినట్టేనా? ఇవాళ్టి సమావేశంతో తేలిపోనుందా?
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishnarao) ఇద్దరూ ఏ పార్టీలోకి వెళతారన్న దానిపై ఇప్పటి వరకూ సందేహాలున్నాయి. పొంగులేటి అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువంటూ వార్తలు వచ్చాయి. కానీ నేడు బీజేపీ చెబుతున్నది మరోలా ఉంది.
తమ పార్టీలో చేరడం ఖాయమని చెబుతోంది. ఖమ్మం వేదికగా పొంగులేటి(Ponguleti Srinivas Reddy)తో బీజేపీ(BJP) చేరికల కమిటీ సమావేశం కానుంది. ముందుగా నేడు ఖమ్మం వేదికగా పొంగులేటితో సమావేశం నిర్వహించనుంది. ఈటల, రఘునందనరావు, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ప్రస్తుతం పొంగులేటి(Ponguleti Srinivas Reddy) ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆ పార్టీ చెబుతోంది. ఖమ్మం సభకు బీజేపీ అగ్రనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం హాజరవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సభ కర్ణాటక ఎన్నికల అనంతరం ఉంటుందని చెబుతున్నాయి.
ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పటి వరకూ అయితే పొంగులేటి(Ponguleti Srinivas Reddy) నుంచి బీజేపీ(BJP)లో చేరుతున్నట్టు ఎలాంటి సంకేతాలూ రాలేదు. మరి నేటి సమావేశంతో ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ(BJP) మాత్రం గట్టిగానే ట్రై చేస్తోంది.