సీఎంగా ప్రమాణం.. తొలి సంతకంతోనే ఆకట్టుకున్న రేవంత్..
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్‌తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, అశేష జనవాహిని నడుమ ఆయన ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. గత రెండు నెలల వ్యవధిలోనే పరిస్థితులన్నీ మారిపోవడం.. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడం.. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం వంటివన్నీ చకచకా జరిగిపోయాయి.
ప్రమాణ స్వీకారానికి ముందే ప్రగతి భవన్ వద్ద ఎత్తైన గ్రిల్స్ తొలగించాలని.. బారికేడ్స్ తీసేయాలంటూ అధికారులకు రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రగతి భవన్ గేటు వద్ద చాలా మంది ప్రముఖులు సైతం ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా సాధారణ ప్రజానీకం సైతం నేరుగా ప్రగతి భవన్‌లోకి వెళ్లేందుకు రేవంత్ వీలు కల్పించారు. అలాగే ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసిన షెడ్‌ను కూడా తొలగించాలని ఆదేశించారు.
ఇక రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం దేనిపై చేస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక రజనీ అనే మరుగుజ్జు యువతికి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగం ఇస్తానని రేవంత్ ప్రకటించారు. అలా ప్రకటించినట్టుగానే రజనీని ప్రమాణ స్వీకారానికి పిలిపించి మరీ ఆమె ఉద్యోగ నియామక పత్రంపై రేవంత్ రెండో సంతకం చేసి ఆకట్టుకున్నారు.