బాత్రూంలో కాలు జారి పడిపోయిన కేసీఆర్.. తుంటికి గాయం

బాత్రూంలో కాలు జారి పడిపోయిన కేసీఆర్.. తుంటికి గాయం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కాలికి గాయం అయింది. ప్రస్తుతం ఆయన సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత అర్ధరాత్రి సమయంలో ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఆయన కాలుజారి కిందపడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.  ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు.

తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం పదకొండు గంటలకు శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్స్ వేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. తుంటి బాల్ డ్యామేజ్ అయినట్లు వైద్య బృందం గుర్తించింది. హాస్పిటల్‌లో కేసీఆర్ వెంట కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉన్నారు. కాగా.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయిన నాటి నుండి కూడా ఆయన ఎర్రవెల్లి లోని ఫార్మ్ హౌస్‌లో ఉన్నారు.

Advertisement

తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఒకవైపు కౌంటింగ్ జరుగుతుండగానే ఆయన ప్రగతి భవన్‌ను వదిలి ఫామ్ హౌస్‌కి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన అక్కడే ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత అర్థరాత్రి బాత్రూమ్‌లో కేసీఆర్ కాలు జారి పడిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.