కొలువుదీరిన కొత్త ప్రభుత్వం: సీఎంగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం

కొలువుదీరిన కొత్త ప్రభుత్వం: సీఎంగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం

ఏపీలో ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా ముగిసింది. చంద్రబాబుతో పాటు మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయగా… ఆయన తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తరువాత నారా లోకేష్ తదితరులంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. నవ్యాంధ్రకు సీఎంగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు.

ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు టీడీపీ పరిమితమవగా.. జనసేన ఒకే ఒక్క స్థానాన్ని సాధించింది. అప్పట్లో విడివిడిగా పోటీ చేసిన ఈ పార్టీలు ఇప్పుడు కలిసి.. బీజేపీని సైతం కలుపుకుని పోటీ చేశాయి. మొత్తంగా 164 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. నవ్యాంధ్ర సారథిగా చంద్రబాబు పాలనా పగ్గాలు స్వీకరించగా.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారాన్ని చేపట్టనున్నట్టు తెలుస్తోంది. 1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో ప్రవేశించాక ఇప్పటి వరకు…  చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. 

ఇక పవన్ కల్యాణ్ జనసేనను స్థాపించిన దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా శాసన సభలో అడుగు పెట్టబోతున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయబోమన్న వైసీపీ సేనకు ఇంతకు మించిన సమాధానం మరొకటి ఉండదేమో. పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న మీదట ఇప్పుడు పవన్ మంచి సక్సెస్‌ను అందుకున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. 70 వేల పై చిలుకు ఓట్లతో పవన్ విజయం సాధించారు.