కొలిక్కి వచ్చిన చంద్రబాబు కేబినెట్ కూర్పు.. జనసేనానికి ఉప ముఖ్యమంత్రి

Chandrababu Cabinet

ఏపీలో మంత్రివర్గ కూర్పు దాదాపు పూర్తైనట్టేనని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రమంతా ఇదే చర్చ. మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయన్న తీవ్ర ఉత్కంఠ. మిత్రపక్షాలకెన్ని? స్వపక్షానికెన్ని? అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఇవాళ సాయంత్రం మంత్రి వర్గంలోకి తీసుకున్న వారికి చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసి చెబుతారని టాక్. జనసేన అధ్యక్షుడి విషయమై అయితే ఉప ముఖ్యమంత్రి ఫిక్స్ అని తెలుస్తోంది. ఇక వైసీపీ మాదిరిగా కాకుండా ఒక్కరికే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నారట. ఇక జనసేనకు ఎన్ని? బీజేపీకి ఎన్ని? ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుని మంత్రి పదవులు ఇస్తున్నారో చూద్దాం.

జనసేన నుంచి నలుగురు..

జనసేనకు అయితే పవన్‌తో కలిపి మొత్తం నాలుగు మంత్రి పదవులు లభించనున్నట్లు సమాచారం. మిగిలిన ముగ్గురిలో నాదేండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొణతాల రామకృష్ణకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వం అడిగిన మేరకు ఆ పార్టీ నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఎవరికి ఇవ్వాలనేది బీజేపీ అధిష్టానం సూచిస్తుందట. ఆశావహులైతే అంచనాలకు మించి ఉన్నారు. అయితే వీరిలో కొందరు ఎమ్మెల్యేగా రెండోసారి, మూడోసారి విజయం సాధించిన వారు సైతం ఉన్నారు. దీంతో వారికి అవకాశాలు మెండుగా ఉన్నట్టు సమాచారం. 

హోంమంత్రి ఎవరికి?

సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవులను చంద్రబాబు కేటాయించనున్నారట. ఈ క్రమంలోనే గుంటూరుకు పెద్ద పీట వేయనున్నారని టాక్. మహిళల్లో ముగ్గురికి మంత్రి పదవులు దక్కనున్నాయట. మరి 21 మంది మహిళా ఎమ్మెల్యేల్లో ఆ ముగ్గురు ఎవరనేది తెలియరాలేదు. ఈసారి యువత కూడా పెద్ద సంఖ్యలోనే విజయం సాధించారు కాబట్టి వారికి కూడా మంచి అవకాశమే దక్కనుంది. హోంమంత్రి ఎవరికనేది ఆసక్తికరంగా మారింది. నారా లోకేష్, పొంగూరు నారాయణకు అయితే బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయని సమాచారం. లోకేష్‌కు ఐటీ శాఖ అప్పగిస్తారని తెలుస్తోంది. మొత్తానికి మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.

Google News