రాజకీయాలకు కేశినేని నాని గుడ్ బై.. కారణమేంటంటే..

రాజకీయాలకు కేశినేని నాని గుడ్ బై.. కారణమేంటంటే..

సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ ఇవ్వననడంతో వైసీపీలోకి వెళ్లి ఆ పార్టీ తరుఫున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన కేశినేని నాని రాజకీయ సన్యాసం స్వీకరించారు. ట్విటర్ వేదికగా తన రాజకీయ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు వెల్లడించారు. ఎంతో ఆలోచించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేశినేని నాని స్పష్టం చేశారు. రెండు సార్లు విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపూర్వమైన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. 

విజయవాడ ప్రజలు తనకు ఇచ్చిన మద్దతుకు కేశినేని నాని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విజయవాడ అభివృద్ధికి కృషిచేస్తున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు చెప్పారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా విజయవాడపై నిబద్దతతోనే ఉంటానని వెల్లడించారు. విజయవాడ అభివృద్ధి కోసం తాను చేయగలిగింది చేస్తానని తెలిపారు. రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కేశినేని నాని ధన్యవాదాలు తెలిపారు. 

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేశినేని నాని తన సోదరుడు కేశినేని చిన్ని చేతిలోనే ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఏపీలో ఆశాజనకంగా ఏమీ లేదు. నిన్న మొన్నటి వరకూ తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన టీడీపీపై ఆయన చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి తరుణంలో తిరిగి ఆయన సొంత పార్టీలోకి వెళ్లలేరు. ఈ క్రమంలోనే కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది.