జగన్, షర్మిల కలుస్తారా?

జగన్, షర్మిల కలుస్తారా? 

ఏపీలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటి వరకూ హీరోగా ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జీరో స్థాయికి పడిపోయారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో స్వయంకృతమే ఎక్కువ. అతి నమ్మకమే ముంచేసిందని టాక్. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. జరగాల్సిందంతా జరిగిపోయింది. నెక్ట్సేంటి? ఇప్పుడు చెల్లి షర్మిలను దగ్గరకు తీస్తారా? మరోవైపు షర్మిల పరిస్థితి కూడా ఆశాజనకంగా ఏమీ లేదు. నిన్న అయితే విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకవర్గం షర్మిలకు వ్యతిరేకంగా.. మరో వర్గం అనుకూలంగా..

పీసీసీ చీఫ్‌గా షర్మిల చేసిందేమీ లేదు. పైగా ఓటు శాతం గతంలో కంటే దారుణంగా పడిపోయింది. దీంతో షర్మిల పరిస్థితి దారుణంగా మారింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె బయటకు వచ్చింది కూడా లేదు. ఈ తరుణంలో ఒకరికొకరి తోడు కావాల్సిందే. మరి అన్నాచెల్లెళ్లు ఒక్కటవుతారా? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవేళ జగన్‌కు కేసులన్నీ మెడకు చుట్టుకుని జైలుకు వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటి? పార్టీకి దిక్కెవరు? ఇప్పుడు ఏ సజ్జలనో.. ధనుంజయ రెడ్డినో నమ్ముకుని పార్టీని అప్పగించే పరిస్థితి లేదు. 

ఈ తరుణంలో చెల్లి షర్మిల లేదంటే తల్లి విజయమ్మ పక్కన ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఆస్తుల పంపకాల గొడవలతో ఇద్దరినీ దూరం పెట్టేశారు. ఈ క్రమంలో షర్మిలకు ఏం కావాలో అది ఇచ్చేసి పక్కన పెట్టుకోవడమే ఉత్తమమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేదంటే చాలా కష్టం. ఆస్తి గొడవలు అన్నాచెల్లెళ్లిద్దరి మధ్య చిచ్చుబెట్టాయి. కష్టాలొచ్చేసరికి జగన్‌కు సోదరితో పాటు తల్లి గుర్తొస్తోందని టాక్. మరి పిలిచి వీరిద్దరికీ పెద్ద పీట వేస్తారా? మొండితనంతో పార్టీని సైతం మంటగలిపేస్తారా? చూడాలి.