సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మరికొన్ని గంటల్లో గవర్నమెంటును ఫామ్ చేయబోతోంది. అన్నీ కుదిరితే ఇవాళే ముఖ్యమంత్రితో పాటు ఒకరిద్దరు ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇవాళ సప్తమి మంచి రోజు కావడంతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి అధిష్టానం ముహూర్తం ఖరారు చేసింది. ఈ రోజు రాత్రి 8 గంటల వరకే సప్తమి ఉంది.
రాజ్ భవన్‌లోనే ప్రమాణ స్వీకారానికి టీ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాజ్‌భవన్‌లో సౌకర్యాల గురించి ఆరా తీసిన కాంగ్రెస్ నాయకత్వం.. 300 మంది వరకూ పాల్గొనేందుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నట్లు గుర్తించింది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే.. నేటి సాయంత్రం ఆరు గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అనే అంతా భావిస్తున్నారు.
డిప్యూటీ సీఎం విషయంలో క్లారిటీ అయితే రాలేదు కానీ భట్టి విక్రమార్కను చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు బస్సులను సైతం కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తోంది. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో విజయోత్సవ సభ.. ఆపై అదే రోజున మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం హాజరుకానుంది. అలాగే పెద్ద సంఖ్యలో ఏఐసీసీ నాయకులను ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది.