రామమందిర నిర్మాణంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుందా?

రామమందిర నిర్మాణంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుందా?

బీజేపీకి నార్త్ ఇండియాలో అయితే డౌట్ లేదు. కానీ సౌత్ ఇండియాలో మాత్రం పట్టే లేదు. సౌత్ ఇండియాలో పట్టు కోసం బీజేపీ కొన్ని దశాబ్దాలుగా నానా తంటాలు పడుతోంది. అయితే తెలంగాణలో మాత్రం అంతో ఇంతో పట్టు అయితే సాధించింది. ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణం బీజేపీకి దేశంలోనే కావల్సినంత మైలేజ్ తెచ్చిపెడుతోంది. ఈ క్రమంలో దక్షిణాది పరిస్థితేంటి? మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈసారైనా పూర్తి స్థాయిలో పట్టు దొరుకుతుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

బీజేపీ దక్షిణ భారతదేశంలో పట్టు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఏ రాష్ట్రాన్నీ వదలడం లేదు. కానీ పట్టు దొరికితేనా? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే బీజేపీపై తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. దీనికి కారణాలు లేకపోలేదు. బీజేపీ మతతత్వ పార్టీ అనేది ఒక కారణమైతే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ విడిపోయాక పుట్టెడు కష్టాల్లో ఆ రాష్ట్రం ఉంది. దానిని ఏ విధంగానూ బీజేపీ ఆదుకున్నది లేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం వంటి అంశాలు ఏపీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.

Advertisement
రామమందిర నిర్మాణంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుందా?

ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ సైతం ఇక్కడ బాగానే బలం పుంజుకుంది. అధికారాన్ని దక్కించుకుంది. బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరిగానే ఉంది. ఏపీలో మాత్రం ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప సీట్లు సాధించడం కష్టం. ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణమైతే సర్వత్రా మంచి చర్చనీయాంశంగా మారింది. మరి ఇది అయినా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మైలేజ్ తెచ్చి పెడుతుందో లేదో చూడాలి.