వైఎస్.. చరిత్ర మరిచిపోలేని పేరు!

వైఎస్.. చరిత్ర మరిచిపోలేని పేరు!

వైఎస్ఆర్.. వైఎస్.. యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి ఆ పేరే ఒక ప్రభంజనం..! చరిత్ర మరిచిపోలేని పేరు! జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన పేరు!. ప్రజల గుండెల్లో కొలువైన ప్రజా రక్షకుడు! ప్రజల కోసమే బతికినవాడు..! ప్రగతి కోసమే జీవించిన నాయకుడు..! జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన పేరు! ఇంకా చెప్పాలంటే.. వ్యవసాయాన్ని పండగ చేసిన చరిత్రకారుడు! సంక్షేమాన్ని పేదవాడికి అందించిన గొప్ప నాయకుడు..! మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి..!

రూపాయి డాక్టర్!

1949, జులై 8.. వైఎస్ఆర్ పుట్టిన రోజు. నాటి కడప జిల్లా పులివెందులలో జయమ్మ, రాజారెడ్డి దంపతులకు పుట్టిన సంతానమే వైఎస్. అప్పట్లోనే స్థానికంగా ప్రజా జీవితంలో ఉన్న రాజా రెడ్డి వారసుడిగా వైద్యుడి రూపంలో నిరుపేదలకు సేవ చేస్తూ సామాజిక సేవను అలవర్చుకున్న వైఎస్. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న వైఎస్సార్.. మెడిసిన్ పూర్తి చేసి వైద్య వృత్తిని స్వీకరించారు. రూపాయికే వైద్య సేవలందించి.. ‘రూపాయి డాక్టర్’గా పేరుపొందారు. అనంతరం రాజకీయరంగ ప్రవేశం చేసి ఓటమెరగని నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. రాజకీయాల్లోకి ప్రవేశించాకా అదే సేవా భావంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. అలా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల మధ్యే ఉంటూ ప్రజల మనిషిగా మారారు.

పులివెందుల పులి!

నాడు ఎన్టీఆర్ హవా కొనసాగుతున్న తరుణంలో కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వైఎస్సార్.. పులివెందులలో తమ్ముడు వివేకానందరెడ్డిని దించి కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దిగారు. మొదటి సారి 1989లో పార్లమెంటుకు పోటీ చేసిన వైఎస్సార్ ప్రత్యర్థిపై 1,66,752 మెజారిటీతో గెలుపొందారు. తర్వాత 1991 సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 4,18,925 రికార్డు స్థాయి మెజారిటీ సాధించి విజయకేతనం ఎగురవేశారు. వైఎస్సార్‌కు అసలైన సవాల్ విసిరింది మాత్రం 1996 ఎన్నికలే. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కేవలం 5,435 మెజారిటీతో గట్టెక్కారు. అప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా, హటాత్తుగా వచ్చిన ఉప ఎన్నికలతో వైఎస్సార్ గెలుపు కష్టసాధ్యమైంది. వైఎస్సార్ ఫ్యామిలీ చిరకాల ప్రత్యర్థి కందుల రాజమోహన్‌రెడ్డి వైఎస్సార్‌ను ఓడించినంత పని చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ 48.75 శాతంతో 368,611 ఓట్లు సాధించగా, కందుల రాజమోహన్ రెడ్డి 48.03 శాతంతో 363,166 ఓట్లు సాధించారు. దీంతో వైఎస్సార్ చరిత్రలోనే స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. అలా ఓటమి ఎరుగని నాయకుడిగా కడప రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. వైఎస్సార్‌ను అభిమానులు ‘పులివెందుల పులి’గా ముద్దుగా పిలుచుకుంటారు.

వైఎస్.. చరిత్ర మరిచిపోలేని పేరు!

పాదయాత్రతో..!

2004లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎండగడుతూ పాదయాత్రతో చంద్రబాబు నాయుడికి ఎదురెళ్లిన ధీశాలి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు వరకు ప్రాంతాలన్నీ కలియతిరుగుతూ, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. వారికి నేనున్నానని భరోసానిస్తూ ముందుగుసాగాడు. అప్పుడు ఊపుమీదున్న తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ డీలాపడిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి కొత్త జోష్‌నిచ్చిన నాయకుడు. ఆ పాదయాత్ర ఫలితమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టడం… 2004, మే 14న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా ” ఎడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి అను నేను” అంటూ ఆ జనహృదయ నేతకు ప్రమాణస్వీకారం చేసే అవకాశం రావడం. ఈ సమయంలోనే 1,460 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. తిరిగి 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంతో రెండోసారి సీఎం అయ్యారు. అయితే, రెండోసారి కేవలం సీఎం అయిన మూడు నెలలకే సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ఊహించని రీతిలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు.

ఆప్యాయత, ఆత్మీయత!

నిరుపేదలకు సేవ చేసిన వైద్యుడిగానే కాదు.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనం చేత నీరాజనం అందుకున్న నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న పవర్‌ఫుల్ మాస్ లీడర్ ఆయన. రాజన్న పేరులోనే కాదు.. మ్యానరిజంలోనూ రాజసం ఉట్టిపడుతుంది. ఆయన చిరు నవ్వులో ఆప్యాయత, ఆత్మీయత ఊగిసలాడుతుంది. తెలుగోడి తెగువకు నిలువుటద్దంలా తెల్లటి పంచెకట్టు, నిండైన ఆహార్యం, అన్నివేళలా ఆకట్టుకునే చిరుదరహాసం.. మడమతిప్పని గుణం.. ఎవరికైనా ఎదురెళ్లే మొండి ధైర్యం.. సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం.. అభాగ్యులను అక్కున చేర్చుకుని అభిమానించే స్వరం.. ఇవి రాజన్న పేరు గుర్తుకొస్తే.. కళ్లముందు కదలాడే రూపం వెనుకున్న జ్ఞాపకాలు. పాద యాత్ర పేరుతో జనంలోకి వెళ్లి.. అదే జనంలోంచి వచ్చిన మాస్ లీడర్‌ వైఎస్.

దటీజ్ రాజన్న..!

సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రజా జీవితంలో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రాజన్నను చూసి బహుషా విధి కూడా ఈర్ష్య పెంచుకున్నట్టుంది. విధి ఆయన్ని భౌతికంగా దూరం చేసిందే కానీ.. జనం గుండెల నుంచి దూరంగా తీసుకుపోలేకపోయింది. అందుకే.. ఆయన జనం నుంచి దూరమై పుష్కరకాలం దాటినా.. ఆ చిరునవ్వు చేసిన సంతకం మాత్రం ఇంకా జనం జ్ఞాపకాల్లో చెక్కుచెదరలేదు. ఆయనపై ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గలేదు. జనం గుండెలను గెలుచుకున్న నాయకుడిని వారికి దూరం చేశానని విర్రవీగిన విధికి తెలియదు.. నాయకుడి స్థానం ఎప్పుడూ గుండెల్లోనే ఉంటుందని.. దటీజ్ రాజన్న..

నాటికి.. నేటికీ!

చరిత్ర మారవచ్చు కానీ చరిత్రలోని నీ పేరు ఎప్పటికీ మారదు! ఆరోగ్యశ్రీ ప్రధాత ఫీజు రియంబర్స్మెంట్ సృష్టికర్త, కొన్ని లక్షల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారుచేసిన సంక్షేమ సారధి డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళి, రాజన్న పాలన కాంగ్రెస్ పార్టీతోనే!. పిల్లలకు సంపూర్ణమైన వ్యక్తిత్వం ఉండాలని కృషి చేసిన ఈయనకు పిల్లల వలన సంపూర్ణత కలిగింది.. పిల్లలను చేయి పట్టుకుని నడిపించిన ఈయన ఎన్నో సార్లు పిల్లల చేయి పట్టుకుని నడుస్తున్నారేమో అనిపించేది!.