నాన్నా.. మీ ఆశయాల సాధనే లక్ష్యం!

నాన్నా.. మీ ఆశయాల సాధనే లక్ష్యం!

వైఎస్సార్.. యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు.! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు బాధత్యలు స్వీకరించి.. తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి. ఆరోగ్య శ్రీ నుంచి 108 వరకు.. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నుంచి రుణమాఫీ వరకు ఇలా ఒకటా రెండా చెప్పుకుంటే పోతే లెక్కలేనన్ని పథకాలే ఉన్నాయ్..! ఆ మహానాయకుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి.. ప్రశంసలు అందుకున్నాయి.. అందుకుంటూనే ఉన్నాయ్! నేడు వైఎస్సార్ జయంతి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, వీరాభిమానులు, కార్యకర్తలు జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు.

మీరే మాకు మార్గం!

‘నాన్నా.. మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం.జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరివరకూ మా కృషి’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

నాటికి.. నేటికీ..!

ఆరోగ్య శ్రీ పథకం పేరు చెప్పగానే కచ్చితంగా ఎవరికైనా టక్కున వైఎస్ గుర్తొస్తారు. స్వతహాగా డాక్టరైన వైఎస్సార్ పేద ప్రజల కోసం తీసుకొచ్చిన గొప్ప పథకమిది. తన పాదయాత్ర అనుభవాలు, తర్వాత తనకు ఎదురైన సంఘటనలతో చలించిపోయి.. వైద్యం అందక ఆగిపోతున్న పేదవాడి గుండెకు ఊపిరి పోసేలా ఆరోగ్య శ్రీని అమలు చేశారు. ఈ పథకం ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటూ ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతోంది. ఎన్నో లక్షల ప్రాణాలను నిలబెట్టిన ఘనత వైఎస్ తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీకి దక్కుతుందనే చెప్పాలి. ఈ పథకం ద్వారా లబ్ది పొందిన ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ వైఎస్సార్‌ను ఓ దేవుడిలా కొలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక అంబులెన్స్ సౌండ్ వినిపిస్తే.. ప్రజల మెదళ్లలో గుర్తుచ్చేది పెద్దాయనే..!

Google News