బీసీలను మళ్ళీ వెనకబడేసిన బాబు!
తెలుగుదేశం పార్టీకి మొదట్లో బలహీన వర్గాల పార్టీ అనే ముద్ర ఉండేది. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ పెట్టినప్పుడు బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎందరో బీసీలను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసి వారికి రాజకీయ భవిష్యత్ ని తీర్చిదిద్దారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీని తమ భుజాలపై మోసింది కూడా బీసీలే.
కానీ టీడీపీ మెల్లగా బీసీల పార్టీ అనే ముద్ర నుంచి దూరం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు వెనుకబడిన బీసీలను పూర్తిగా వెనకకు నెట్టేశారు. ధనం, అగ్రవర్ణం తన ప్రాధాన్యంగా మార్చుకున్నారు బాబు. పెట్టుబడిదారులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. పెట్టుబడిదారుల్లో ఎక్కవుగా అగ్రవర్ణాలకు చెందినవారే అని చెప్పడంలో అనుమానం లేదు కదా. అలా టీడీపీ బీసీల పార్టీ అనే ముద్ర నుంచి అగ్రవర్ణాల, పెట్టుబడిదారుల పార్టీగా రూపాంతరం చెందింది.
ఎప్పుడైతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీసీలు, నిమ్న వర్గాలు, పేదవాళ్లకు చట్టసభల్లో అవకాశాలు ఎక్కువగా మొదలు పెట్టారో బాబు అప్పుడు మళ్ళీ బీసీ మంత్రం జపిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. మొన్నటివరకు బీసీలకు, పేదవాళ్లకు తమ పార్టీ ఎక్కువ సీట్లు ఇస్తుంది అని ఊదరగొట్టిన బాబు ఎప్పటిలానే తన మాటలు వేరు, చేతలు వేరు అని నిరూపించారు.
తాజాగా విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో చంద్రబాబు నాయుడు ఏ వర్గాలకు ఎన్ని సీట్లు ఇచ్చారో చూడండి.
- 45 % జనాభా ఉన్న బీసీలకు బాబు ఇచ్చిన సీట్లు 18
- మైనారిటీలకు ఒకే ఒక్క సీటు
- 4% జనాభా ఉన్న కమ్మలకు ఏకంగా 21 సీట్లు
అనేక కులాలతో కూడిన బీసీలకు 18, కమ్మలకు 21. రెడ్లకు కూడా అధికంగానే ఇచ్చారు. అంటే అగ్రవర్ణాలకు సీట్లు, బలహీన వర్గాలకు తియ్యటి మాటలు.
బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే బాబుకి బుద్ధి చెప్పేందుకు బలహీనవర్గాలు సిద్ధం అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో బాబుకు కర్రు కాల్చి వాత పెట్టాడం ఖాయం అని బీసీ నేతలు అంటున్నారు.