ఏకంగా మెగాస్టార్ చిత్రంలోనే ఛాన్స్ అందుకున్న ఆషిక..

ఏకంగా మెగాస్టార్ చిత్రంలోనే ఛాన్స్ అందుకున్న ఆషిక..

యంగ్‌ హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ బంపర్‌ ఆఫర్‌ అందుకుంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే అవకాశాన్ని దక్కించుకుంది. చిరు హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’లో అవకాశాన్ని సొంతం చేసుకుంది. అమిగోస్ చిత్రం ద్వారా ఆషిక టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత నాగార్జున హీరోగా రూపొందిన ‘నా సామిరంగ’ చిత్రంతో ఆషిక మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

విశ్వంభర సోషియో ఫాంటసీ చిత్రంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా కోసం నిర్మాతలు రూ.200 కోట్లను వెచ్చిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఇప్పటి వరకూ చూడని సరికొత్త పాత్రలో చూపించనున్నారని టాక్. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉండబోతున్నాయట. ఇవి సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రాజెక్టులో స్టార్ హీరోయిన్ త్రిష సైతం నటిస్తోంది. ఇప్పుడు ఆషికాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక మరో ముగ్గురు హీరోయిన్ల పేర్లను ప్రకటించాల్సి ఉంది. సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో నటించనున్నారని టాక్ నడుస్తోంది కానీ ఇప్పటి వరకైతే పేర్లను ప్రకటించలేదు. తాజాగా విశ్వంభర గురించి వశిష్ట మాట్లాడుతూ.. ఇది పూర్తి స్థాయి ఫాంటసీ జానర్ అని.. 70 శాత స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిపారు. పంచ భూతాలు, త్రిశూల శక్తికి ఆధ్యాత్మికతను జోడిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నట్టు వశిష్ట తెలిపారు.