నాగి చెప్పుల కథ

కల్కి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు దర్శకుడు నాగ్ అశ్విన్ అలియాస్ నాగి. మూడేళ్ల పాటు కల్కి కథపై కసరత్తు చేసి పార్ట్-1 రిలీజ్ చేసిన ఈ దర్శకుడు, అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. తాజా విజయంతో నాగి ఎవరు, అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటనే విషయాలపై సోషల్ మీడియాలో ఆరాలు ఎక్కువయ్యాయి.

తాజాగా నిర్మాత అశ్వనీదత్ కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఆయన నాగి నేపథ్యాన్ని చెప్పలేదు కానీ, తన అల్లుడు సినిమాల పట్ల ఎంత డెడికేషన్ తో ఉంటాడనే విషయంపై ఓ చిన్న ఉదాహరణ చెప్పారు.

కెరీర్ లో దాదాపు అందరు స్టార్స్ తో సినిమాలు చేసిన అశ్వనీదత్ కు ప్రభాస్ తో మూవీ చేయాలనే కోరిక ఉండిపోయింది. ఇదే విషయాన్ని మహానటి తర్వాత నాగికి ఫోన్ చేసి చెప్పారట. తన మైండ్ లో 4 ఏళ్ల నుంచి ఓ కథ నలుగుతోందని, 3 రోజులు టైమ్ ఇస్తే వచ్చి చెబుతానని తన మామయ్య అశ్వనీదత్ కు చెప్పాడట నాగి. అదే కల్కి కథ.

ఆ కథలో నాగి ఎంత లీనమైపోయాడంటే.. వచ్చేటప్పుడు చూసుకోకుండా తన తండ్రి చెప్పులు వేసుకొని వచ్చేశాడట. అరగంట పాటు అశ్వనీదత్ కు కథ చెప్పాడట. వెళ్లేటప్పుడు మరిచిపోయి అశ్వనీదత్ చెప్పులు వేసుకొని వెళ్లిపోయాడట. కథలో లీనమైనప్పుడు నాగి ప్రవర్తన ఆ విధంగా ఉంటుందని, తననుతాను మరిచిపోతాడని అంటున్నారు అశ్వనీదత్.

Google News