వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం
టాలీవుడ్ మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆయనను పద్మవిభూషణ్ వరించింది. ఆయనకు అవార్డులు కొత్తేమీ కాదు కానీ ఇది మాత్రం ఆయన ప్రతిభకు దక్కిన అత్యున్నత పురస్కారం. 1978 మొదలు ఇప్పటి వరకూ ఆయన ఇండస్ట్రీలో హీరోగానే కొనసాగారు. ఇది అందరికీ సాధ్యపడని విషయం. దశాబ్దాల పాటు స్టార్ డమ్ కొనసాగించడమంటే మాటలు కాదు.
తాజాగా మెగాస్టార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటిచండంపై ఆయన స్పందించారు. ఎక్స్ వేదికగా చిరు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిందని.. ఈ సమయంలో తనకు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదన్నారు. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చిరు తెలిపారు.
ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తనను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ సభ్యుల అండ దండలు, నీడలా తనతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని ఒకింత చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం వీడియోలో మాట్లాడుతూ.. తనకు దక్కిన ఈ గౌరవం ప్రజలదేనన్నారు. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని ప్రశ్నించారు. తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి తన శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నానన్నారు. నిజ జీవితంలోనూ సమాజానికి అవసరమైన సాయం చేస్తూనే ఉన్నానని చిరు తెలిపారు.