Comedian Sudhakar: చిరు, నేను ఒకే రూమ్‌లో కలిసుండే వాళ్లం.. ఏ అవసరమొచ్చినా.. : సుధాకర్

Comedian Sudhakar: చిరు, నేను ఒకే రూమ్‌లో కలిసుండే వాళ్లం.. ఏ అవసరమొచ్చినా.. : సుధాకర్

ప్రముఖ కమెడియన్ సుధాకర్(Comedian Sudhakar) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. ఆయన కామెడీ టైమింగ్‌తో పాటు స్పెషల్ డిక్షన్‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న సుధాకర్ ఇటీవల కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంన్నారు. ఆ మధ్య కాలంలో ఓ టీవీ ఛానల్‌లో ఓ కార్యక్రమంలో ఆయన తరచూ కనిపించారు.

అయితే అనారోగ్యానికి గురవడంతో టీవీ ఛానల్‌కి కూడా దూరంగా ఉంటున్నారు. అయితే ఆయనను సోషల్ మీడియాలో జనాలు ఇప్పటి వరకూ ఎన్ని సార్లు చంపేశారో తెలియనిది కాదు. ప్రతిసారీ ఆయన తాను బతికే ఉన్నానంటూ చెప్పుకోవడం సర్వసాధారణమై పోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పందించారు. ఇలాంటి వార్తలు రావడం తనకు బాధగా అనిపించిందన్నారు. తానే మీడియా ముందుకు వచ్చి బతికే ఉన్నానని చెప్పుకోవడం దారుణమన్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో తనకున్న సాన్నిహిత్యాన్ని సుధాకర్ ఫాదర్స్ డే సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలో చిరంజీవి(Chiranjeevi)తో కలిసి ఒకే రూమ్‌లో ఉండేవారమని తెలిపారు. అప్పుడు మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. చిరు(Chiranjeevi)ని, పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ని అన్నయ్య అని పిలుస్తానని వెల్లడించారు. తనకు ఏ అవసరం వచ్చినా కూడా చిరునే అడుగుతానని.. ఆయన కాదనకుండా సాయం చేస్తారని తెలిపారు. ఆ కుటుంబంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని సుధాకర్(Sudhakar) తెలిపారు.