టంగ్ స్లిప్పై చిక్కుల్లో పడిన విజయ్ ఆంటోని..

టంగ్ స్లిప్పై చిక్కుల్లో పడిన విజయ్ ఆంటోని.. 

ప్రస్తుతం నడుస్తున్నది సోషల్ మీడియా కాలం. పొరపాటున నోరు జారామో అంతే సంగతులు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏమైనా నోరు జారితే నెటిజన్లు పెద్ద ఎత్తున అటాక్ చేస్తారు. సాధారణ వ్యక్తులనైతే పట్టించుకోకుండా వదిలేస్తారేమో కానీ సెలబ్రిటీలను అసలు ఏమాత్రం అలా వదలరు. మీమ్స్, ట్రోల్స్‌తో అల్లాడించేస్తారు. తాజాగా ఓ కోలీవుడ్ హీరోని నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. ఆ హీరో మరెవరో కాదు.. విజయ్ ఆంటోని.

హీరో విజయ్ ఆంటోని లేటెస్ట్ గా ఒక వివాదంలో ఇరుక్కున్నాడు. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం విజయ్ ఆంటోని నటించిన రోమియో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ బీభత్సంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ ఆంటోని తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా మద్యపానం గురించి మాట్లాడాడు. మందు తాగడంలో ఆడ, మగా తేడా లేదన్నాడు.

అంతటితో ఆగితే బాగానే ఉండేది. మద్యపానమనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని.. క్రీస్తు కూడా ద్రాక్షరసం తాగే వాడని విజయ్ ఆంటోని అన్నాడు. అంతే.. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తమిళనాడు క్రైస్తవ సంఘాలన్నీ అటాక్ చేశాయి. విజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. విజయ్ వెంటనే చేసిన తప్పును తెలుసుకుని క్రైస్తవులకు క్షమాపణ చెప్పాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పాడు.