రెమ్యూనరేషన్ దాదాపు డబుల్ చేసిన ప్రేమలు హీరోయిన్

రెమ్యూనరేషన్ దాదాపు డబుల్ చేసిన ప్రేమలు హీరోయిన్

ఒకసారి క్లిక్ అయితే చాలు.. క్రేజ్ ఇతర ఇండస్ట్రీలకు కూడా పాకేస్తుంది. ఇక పాకేసిన తర్వాత నటీనటులు ఊరుకుంటారా? రెమ్యూనరేషన్ అమాంతం పెంచేయరు. ప్రస్తుతం మలయాళ భామ మమితా బైజు సైతం ఇదే చేస్తోంది. 22 ఏళ్ల వయసుకే ఈ ముద్దుగుమ్మ దక్షిణాదిని ఒక ఊపు ఊపేస్తోంది. 2017లో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మమితా బైజు.. కొద్ది కాలానికే అద్భుతమైన చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఆమె నటించిన కోకో, సూపర్‌ శరణ్య వంటి మలయాళ చిత్రాలు విజయం సాధించాయి. ఇటీవల ఈ అమ్మడు నటించిన ప్రేమలు మూవీ మలయాళంలోనే కాకుండా, తమిళం, తెలుగు భాషల్లోనూ అనూహ్య విజయాన్ని అందుకుంది. దీంతో టాలీవుడ్‌లోనూ అమ్మడికి క్రేజ్ పెరిగింది. స్టార్ హీరో సూర్య చిత్రం నుంచి అనూహ్యంగా బయటకు వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ దర్శకుడు బాలాపై చాలా ఆరోపణలు చేసి చర్చనీయాంశంగా మారింది.

ఏది ఏమైనా దక్షిణాదిలో మాత్రం మమితా బైజు తన హవాను చాటుతోంది. దీంతో కోలీవుడ్‌లో సైతం అమ్మడికి అవకాశం వచ్చింది. జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా రెబల్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఇన్ని అవకాశాలు తన్నుకుంటూ వస్తుండటంతో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిందని సమాచారం. ఇప్పటి వరకూ ఒక్కో సినిమాకు రూ. 30 లక్షలు తీసుకుంటున్న మమితా.. దాన్ని కాస్తా ఇప్పుడు రూ.50 లక్షలు చేసిందని టాక్.