కమెడియన్ పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు

కమెడియన్ పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు

ప్రముఖ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్‌కు విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెలా భరణం చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలను పృథ్వీరాజ్.. ధిక్కరించడమే కాకుండా కోర్టుకు సైతం గైర్హాజరయ్యారు. దీంతో ఆయనకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.  విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో  పృథ్వీరాజ్‌కు 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. కొన్నేళ్లుగా వీరిద్దరికీ పడటం లేదు.

2017లో శ్రీలక్ష్మి భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. పృథ్వీరాజ్ సినిమాల్లోకి వెళ్లాక తనను వేధింపులకు గురి చేస్తున్నాడని.. 2016 ఏప్రిల్‌ 5న ఇంట్లో నుంచి తనని బయటకు పంపించడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ తరుణంలో తనకు జీవన భృతి కోసం నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని కోరింది. 

తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని వెల్లడించింది. కాబట్టి తనకు నెలకు 8 లక్షలు రూపాయలు భరణం చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరింది. ఈ క్రమంలోనే శ్రీలక్ష్మికి భరణంతో పాటు ఆమెకు ఇప్పటి వరకూ అయిన కోర్టు ఖర్చులు సైతం చెల్లించాలని ఇటీవలే కోర్టు తీర్పును వెలువరించింది. కానీ పృథ్వీరాజ్ కోర్టు ఆదేశాలను పాటించలేదు. దీంతో పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను విజయవాడ ఫ్యామిలీ కోర్టు జారీ చేసినట్టు తెలుస్తోంది.