పిఠాపురంకే ఓటేసిన జనసేనాని… ప్రకటించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan

సస్పెన్స్ కి తెరపడింది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగానే పోటీ చెయ్యనున్నారు. ముందు నుంచి వినిపిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ బరిలో ఉండబోతున్నారు. తాను పిఠాపురం నుండి పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రకటించారు.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన తన పార్టీ సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అదే వేదికపై తన సీటుని ప్రకటించడం విశేషం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేయగా, రెండు చోట్లా ఘోరంగా ఓడి అవమానపాలు అయ్యారు. అందుకే, ఈ సారి పోటీ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా తర్జన భర్జన చెయ్యాల్సి వచ్చింది. రాజకీయ ఎత్తుగడలో భాగంగా తాను ఎక్కడి నుంచి పోటీ చెయ్యబోతున్నది ఇప్పటివరకు సస్పెన్స్ లో ఉంచడంలో సక్సెస్ అయ్యారు.

మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రానున్న తరుణంలో తన సీటు గురించి క్లారిటీ ఇచ్చి కార్యకర్తల్లో జోష్ తెచ్చారు జనసేనాని.

సేఫ్ ప్లేస్!

పిఠాపురం పవన్ కళ్యాణ్ కి ఒక విధంగా చెప్పాలంటే చాలా సేఫ్ ప్లేస్. గోదావరి జిల్లాల్లో జనసేన ఊపు ఉంది అనే భావన ఉంది. ఈసారి టార్గెట్ మిస్ కావొద్దని భావనతో ఈ నియోజకవర్గం ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడ కాపుల సంఖ్య ఎక్కువ. పైగా యువత పెద్ద ఎత్తున ఉన్నారు. యువతలో పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ లెక్కన పవన్ కళ్యాణ్ సరయిన సీటు ఎంచుకున్నారు ఈ సారి.