పిఠాపురం మంటలు… తెలుగుతమ్ముళ్ల కేకలు

అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ ప్రకటన జనసేన వర్గాల్లో సంతోషాన్ని నింపగా, తెలుగుదేశంలో చిచ్చు రేపింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చెయ్యబోతున్నాయి. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 సీట్లుగా పంచుకున్నాయి. కానీ కూటమి సీట్ల కేటాయంపు మాత్రం అంతా సవ్యంగా జరగడం లేదు.

ముఖ్యంగా పిఠాపురం తెలుగుదేశం కార్యకర్తలు భగ్గుమన్నారు పవన్ కళ్యాణ్ ప్రకటనతో.

Advertisement

పిఠాపురంలో టిడిపి కార్యకర్తలు, నేతలు రివర్స్ అయ్యారు. టిడిపి కార్యాలయం వద్ద చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు చించివేసి, పార్టీ కరపత్రాలు దగ్ధం చేశారు. బూతులు తిట్టారు. పార్టీ నిర్ణయంతో జిల్లాలో తెలుగుదేశం ఉనికి లేకుండా పోతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ కి పిఠాపురం సీటు ఖరారు అయింది అని రెండు రోజుల క్రితమే వార్త గుప్పుమంది. దాంతో, పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ అనుచరులు “లోకల్స్ ముద్దు, నాన్ లోకల్స్ వద్దు” అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఫ్లెక్సీలు కూడా పుట్టుకొచ్చాయి. రెండు రోజులుగా పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య రచ్చ సాగుతోంది. పవన్ తాజా ప్రకటనతో అది ముదిరింది.

పిఠాపురంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య స్పష్టమైన చీలిక ఏర్పడింది.