బీజేపీ సీట్ల అమ్మకం ఆరోపణలు!

Andhra BJP

సీట్లు అమ్ముకున్నారు అనే మాట సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. అలాంటి ఆరోపణలు ఇటీవల తెలంగాణలో చూశాం. బహుశా మొదటిసారి ఇలాంటి ఆరోపణ బీజేపీలో వినిపిస్తోంది. అదీ కూడా ఆంధ్రప్రదేశ్ లో.

ఇందులో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ బీజేపీ సీనియర్ల నేతల నుంచి ఇలాంటి కామెంట్స్ ఆఫ్ ది రికార్డుగా వస్తున్నాయి. బీజేపీ తెలుగుదేశం, జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చెయ్యనుంది. 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాలు బీజేపీకి దక్కాయి. ఐతే, 10 సీట్ల విషయంలోనే కొంత గోల్ మాల్ జరిగింది అనే మాట వినిపిస్తోంది.

Advertisement

ఎమ్మెల్యే సీట్ల విషయంలో వేలం పాట జరిగిందన్న ఆరోపణలు రావడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ప్రముఖ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్. ఐతే సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, గోనుగుంట్ల సూర్యనారాయణ వంటి పాత తెలుగుదేశం బ్యాచ్ ఇప్పుడు ఎక్కువ సీట్లు పొందే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇంకా అనౌన్సమెంట్ కాలేదు కానీ అప్పుడే బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గోల్మాల్ చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి.

కానీ, బీజేపీలో సెంట్రల్ హై కమాండ్ మాటే చెల్లుతుంది. మరి పురంధరేశ్వరి ఆ సెంట్రల్ టీంని ఎలా ఒప్పిస్తారో చూడాలి. కానీ పాత, ఒరిజినల్ బీజేపీ నాయకులకు సీట్లు దక్కకుండా వలస నేతలకు పురంధరేశ్వరి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో ఎదో కొనుగోల్మాల్ జరిగి ఉంటుంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లడం, బీజేపీ పెద్దలు ఈ విషయంలో ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.