దర్శకుల కోసం ఆ పని చేసిన ప్రభాస్

దర్శకుల కోసం ఆ పని చేసిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలే తప్ప.. ఎప్పుడూ కూడా ఎలాంటి సందర్భంలోనూ పెద్దగా సాయం చేసిన దాఖలాలైతే లేవు. తన పనేదో తాను చేసుకు పోతూ ఉంటాడు. ఫ్యాన్స్‌ని కూడా పెద్దగా పట్టించుకోడనే పేరు ఉంది. ఇది ఎంత నిజమో తెలియదు కానీ తాజాగా ప్రభాస్ చేసిన పనికి ప్రశంసలైతే బాగానే వస్తున్నాయి. తాజాగా ప్రభాస్ తెలుగు దర్శకుల కోసం రూ.35 లక్షలు విరాళమిచ్చి చర్చనీయాంశంగా మారాడు.

ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం టాలీవుడ్ నుంచి మరో ఇద్దరు హీరోలను తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ కావొచ్చింది. అయితే రిలీజ్ డేట్‌ను మాత్రం ఇప్పటి వరకూ చిత్ర యూనిట్ ప్రకటించలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం వివిధ ఇండస్ట్రీల నుంచి స్టార్ తారాగణాన్ని నాగ్ అశ్విన్ తీసుకున్నారు. 

అయితే మే 4న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు పుట్టినరోజు. ప్రతి ఏడాది ఈ రోజును డైరెక్టర్స్‌ డేగా జరుపుకుంటున్నారు. ఈసారి కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ వేడుకని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వానం ప్రముఖులందరికీ ఇప్పటికే అందింది. ఈ క్రమంలోనే ప్రభాస్‌ని కూడా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ సభ్యులు వెళ్లి ఆహ్వనించినట్టు సమాచారం. ఈ సెలబ్రేషన్స్ కోసమే ప్రభాస్ రూ.35 లక్షల విరాళం కూడా ఇచ్చారని అసోసియేషన్ ప్రెసిడెంట్ వెల్లడించారు.