బాలయ్య కోసం సెట్ సిద్ధం.. త్వరలోనే షూటింగ్..

బాలయ్య కోసం సెట్ సిద్ధం.. త్వరలోనే షూటింగ్..

ఎన్నికల హడావుడి ముగియడంతో మళ్లీ సినిమాలపై దృష్టి సారించేందుకు నందమూరి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. ఏపీలో ఎన్నికల కారణంగా కొన్ని నెలల పాటు షూటింగ్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలే ఆయన పుట్టిన రోజు సందర్భంగా బోయపాటి ఓ సినిమాను ప్రకటించి మాస్ ఆడియన్స్‌కు ఫుల్ జోష్ ఇచ్చారు. ఈ చిత్రం అఖండకు సీక్వెలా? అనే టాక్ కూడా నడుస్తోంది. 

ఇక బోయపాటితో సినిమా విషయం పక్కనబెడితే.. ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాబీ దేవోల్‌నటిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఈ చిత్రం కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు బాలయ్య ఫ్రీ అవడంతో ఈ సినిమా ఈ నెలాఖరు నుంచి పునఃప్రారంభం కానుందని సమాచారం. 

ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌ కూడా సిద్ధమైందట. ఆ సెట్‌లోనే ఈ కొత్త షెడ్యూల్‌ మొదలు కానుందట. ఈ సెట్‌లో బాలయ్యపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్యలో రెండు షేడ్స్ కనిపిస్తాయట. ఇలాంటి పాత్రలో ఆయన ఇంతవరకూ చేసింది లేదట. ఇందులో ఆయనకు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.