పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్ కొడుకు రోష‌న్

పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్ కొడుకు రోష‌న్

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘వృషభ’. రీసెంట్‌గా సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాగానే ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. అభిమానులు, సినీ ప్రేమికులు సినిమా అప్‌డేట్స్ గురించి ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. వృష‌భ చిత్రంలో మోహ‌న్ లాల్ త‌న‌యుడుగా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. తాజాగా దీనికి సంబంధించి మేక‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో రోష‌న్ మేక.. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ కొడుకు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. 

2024లో భారీ బ‌డ్జెట్‌తో వృష‌భ తెర‌కెక్క‌నుంది. తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే ఇంటెన్స్ ఎపిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. భారీ తారాగ‌ణం, లేటెస్ట్ వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నాల‌జీతో పాటు హై యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రం అభిమానుల‌కు ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ ఘంటా ప‌థంగా చెబుతున్నారు. విజువ‌ల్ వండ‌ర్‌గా వృష‌భ చిత్రాన్ని రూపొందించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Mohanlal in Vrushabha movie

ఈ సంద‌ర్భంగా ఏవీఎస్ స్టూడియోస్ అధినేత‌, నిర్మాత అభిషేక్ వ్యాస్ మాట్లాడుతూ ‘‘సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించేలా సన్నాహాలు చేస్తున్నాం. ప్రతీ సన్నివేశాన్ని అభిమానులు ఎంజాయ్ చేసేలా రూపొందించాలనే ఆలోచనతో తెరకెక్కిస్తున్నాం. ఈ నేపథ్యంలో మోహన్ లాల్ తనయుడిగా టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనిపించనుున్నారు. సినిమాలో ఎంతో కీల‌క‌మైన ఆ పాత్ర‌కు రోష‌న్ త‌న టాలెంట్‌తో ఒదిగిపోతారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు. 

డైరెక్ట‌ర్ నంద కిషోర్ మాట్లాడుతూ ‘‘ఎప్పుడైతే రోష‌న్‌ను వృష‌భ సినిమా కోసం క‌లిశానో అప్పుడే త‌ను మోహ‌న్ లాల్ కొడుకుగా స‌రిపోతార‌ని నిర్ణ‌యించుకున్నాను. త‌ను ఇంత‌కు ముందు న‌టించిన సినిమాల‌ను చూశాను. త‌న యాక్టింగ్ స్కిల్స్ ఆక‌ట్టుకున్నాయి. త‌ను ఈ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతారు’’ అన్నారు. 

రోష‌న్ మేక మాట్లాడుతూ ‘‘మోహన్‌లాల్‌గారి వంటి గొప్ప న‌టుడితో స్క్రీన్ షేర్ చేసుకోవ‌టం గొప్ప అవ‌కాశంగా భావిస్తున్నాను. వృష‌భ చిత్రంలో నేను చేయ‌బోయే పాత్ర చాలెజింగ్‌గా ఉంటుంది. డైరెక్ట‌ర్ నంద‌గారి అంచ‌నాల‌ను రీచ్ కావ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నాను. ఇంత భారీ చిత్రంలో న‌టించ‌టం గౌర‌వంగా భావిస్తున్నాను’’ అన్నారు. 

బాలాజీ టెలీ ఫిల్మ్స్‌, క‌నెక్ట్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో ఏవీఎస్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న వృష‌భ మూవీ షూటింగ్ జూలై త‌ర్వాత ప్రారంభం కానుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 4500 స్క్రీన్స్‌లో మ‌ల‌యాళం, తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. నంద కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ వ్యాస్‌(ఏవీఎస్ స్టూడియోస్‌), విశాల్ గుర్నాని, జూహీ ప‌రేక్ మెహ‌తా, శ్యామ్ సుంద‌ర్ (ఫ‌స్ట్ స్టెప్ మూవీస్‌, ఏక్తా ఆర్‌.క‌పూర్, శోభా క‌పూర్‌ (బాలాజీ టెలీ ఫిల్మ్స్‌), వ‌రుణ్ మాథుర్ (క‌నెక్ట్ మీడియా)  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Google News