విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారే!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా తెలంగాణ నుంచి వచ్చి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు, కొండంత అభిమానం పంచే అభిమానులను సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా గుర్తింపు మాత్రం కొండంత. అలాంటిది కల్కి సినిమా రిలీజ్‌తో ఒక్కసారిగా ఈయన పరువును గంగలో కలిపేసింది సోషల్ మీడియా. ఈ సినిమాలో అర్జునుడు పాత్రలో విజయ్ నటించాడు. ఇంతవరకూ బాగానే ఉంది. సినిమా థియేటర్లలోకి వచ్చేసింది కో అంటే కోటి అన్నట్లుగా కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది. కానీ.. దేవరకొండ నటనపై మాత్రం ఓ రేంజిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి.
కల్కి సినిమాలో విజయ్ పాత్ర క్యామియోనే.. ఈ పాత్రకు ఆయన మాత్రమే సెట్ అవుతారని భావించిన సదరు నిర్మాణ సంస్థ, దర్శకుడు తీసుకున్నారు. అయితే.. ఎందుకో ఈ పాత్రలో అస్సలు దేవరకొండ సెట్ అవ్వలేదు.. గెటప్ అస్సలు బాలేదని.. అంతేకాదు డైలాగ్ డెలివరీ కూడా దరిద్రంగా ఉందని సినీ ప్రియులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో ఇదే వరస్ట్ క్యారెక్టర్ అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఈ యంగ్ హీరో అంటే పడని వాళ్లు అయితే బాబోయ్.. తెగ తిట్టేస్తున్నారు. తమరి బదులు ఏ సంపూర్ణేష్ బాబును పెట్టి ఉన్నా బాగుండేందంటూ ట్రోల్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యింది మొదలుకుని ఇప్పటి వరకూ ఒక్కటే విమర్శలు.
తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడినంత మాత్రాన ఇలా విమర్శలు చేయడం, టార్గెట్ చేయడం ఎంతవరకూ సబబు అనేది ఆ విమర్శకులకే తెలియాల్సి ఉంది. అకారణంగా తిట్టిపోయడం గమనార్హం. వాస్తవానికి దేవరకొండ ఏ పాత్ర చేసినా.. ఏం మాట్లాడినా తెలంగాణ భాష ఆటోమాటిక్‌గా వచ్చేస్తోంది. ఇది ఎంత మార్చుకోవాలనుకున్నా అయ్యే పని అస్సలు కాదు. అందుకే ఇలా విమర్శలు వస్తున్నాయి. అందుకే కల్కిలో ఆయన నటన, డైలాగ్ డెలివరీపై భూతద్ధంలో వెతికి మరీ చూపిస్తూ విమర్శలు చేస్తున్న పరిస్థితి. అయినా ఈ మధ్య కొంతమంది కావాలని పనికట్టుకొని మరీ విజయ్ దేవరకొండ మీద ట్రోల్స్ చేస్తున్నరన్నది జగమెరిగిన సత్యమే. ఈ వ్యవహారంపై విజయ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.