ఆడబిడ్డలకు జగనన్న కట్నం.. ఒకేసారి 5 లక్షల గృహాల ప్రారంభం

ఎవరికైనా ముందుగా కావల్సింది కూడు, గూడు, గుడ్డ. అవి కల్పించిన వారే కదా.. అసలు సిసలైన నేత. తాజాగా ఏపీ సీఎం జగన్ చేస్తున్నది కదా ఇదే. రాష్ట్రంలో సొంత ఇల్లు లేనివాళ్లు ఉండరాదన్నది సీఎం వైయస్ జగన్ సంకల్పం. ప్రతీ ఒక మహిళ తన పిల్లాపాపలతో సొంత ఇంటిలో ఉండాలని, దానికి తనవంతుగా గొప్ప సాయం అందించాలని అయన సంకల్పం తీసుకున్నారు. అందులో భాగంగా 30.75 లక్షల మందికి రూ.76,000 కోట్ల విలువైన ఇళ్ళ స్థలాలకు సంబంధించి పట్టాలు అందజేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 21.76 లక్షల గృహాలు నిర్మించాలని డిసైడ్ అయ్యారు. దీనికి గానూ రూ.56,700 కోట్లు ఖర్చు అవుతుందని లెక్క వేశారు.

నిజానికి ఏపీలో ఖజానా ఖాళీగా ఉంది. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం పెద్ద సాహసమే. రాష్ట్రంలో ఒకే ఒక పథకానికి అంత బడ్జెట్ అంటే పెను భారం.. కానీ నిరుపేదలకు సొంతింట కల నెరవేర్చాలన్న తలంపు.. ఇచ్చి తీరాలన్న దృఢచిత్తం ఉన్న తరువాత ఎలాంటి అడ్డంకులూ ఆయన్ను ఆపలేకపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా జగనన్నకాలనీల కోసం స్థలసేకరణ జరిగింది. అక్కడ ఇళ్ళు నిర్మించేందుకు వీలుగా రోడ్లు, నీళ్లు, విద్యుత్, పార్కుల వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చారు. దీంతో మెల్లగా ఇళ్ల నిర్మాణం మొదలవుతోంది. ఒక్కొక్కరూ తమకు ఇచ్చిన జాగాలో ప్రభుత్వ సాయంతో ఇల్లు కట్టుకుంటున్నారు. ఎంత తక్కువగా లెక్కేసినా ఒక్కో ఇంటి ధర ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. అంటే సీఎం వైఎస్ జగన్ ఆలోచనలు వాస్తవరూపం దాలుస్తుండడంతో రాష్ట్రంలో పేదల జీవన స్వరూపమే మారుతోంది. ఇళ్లులేని పేదలు ఇక మీదట ఆత్మగౌరవంతో సొంత ఇంట్లో ఉండొచ్చు.

సామూహిక గృహప్రవేశాలకు జగన్..

ఒక ఉద్యమం మాదిరిగా ఏపీ సీఎం జగన్ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న అధికారులు అటు లబ్ధిదారులకు అన్నిరకాలుగా తోడ్పాటును అందిస్తున్నారు. ఇటుక, సిమెంట్, కంకర, ఐరన్, తలుపులు, గుమ్మాలు, కిటికీలను సైతం సమకూరుస్తూ నిర్మాణం త్వరగా అయ్యేలా చూస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం కింద 5.24 లక్షల గృహాలు పూర్తవగా వాటిని నేడు లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ క్రమంలో దాదాపు 2412 ఇళ్లను పూర్తి చేసుకున్న సామర్లకోట పట్టణంలో లబ్ధిదారుల సామూహిక గృహప్రవేశాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు అవుతున్నారు. ఆ కాలనీల్లో ఇప్పటికే పార్కులు, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం అక్కడ నివాసానికి సకలం సమకూర్చింది. ఈ సందర్భంగా లబ్దిదారులతోబాటు జగన్ మోహన్ రెడ్డి సైతం వారి సంతోషాల్లో భాగం పంచుకుంటారు. పేదల ఇళ్లలో చిరునవ్వులు పూయించేందుకు సీఎం వైయస్ జగన్ చేస్తున్న కృషి ఫలవంతం అవుతున్నందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.