చంద్రబాబు అరెస్ట్.. ముచ్చటగా మూడు కుంపట్లు స్టార్ట్..

చంద్రబాబుకు ఐటీ నోటీసులు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు జైలు పాలవడంతో పార్టీ నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా  వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ బజారున పడింది. ఇక్కడి విభేదాలు చంద్రబాబు అరెస్ట్ తర్వాత కళ్లకు కడుతున్నాయి. ముగ్గురు నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ సంఘటితంగా పోరాడాల్సిన చోట సంఘాలుగా విడిపోయి మరీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  

చంద్రబాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి శివాలయం సెంట‌ర్‌లో,  ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి జ‌మ్మల‌మ‌డుగు రోడ్డులోని త‌న కార్యాల‌యం వ‌ద్ద, , అలాగే మరో కీలక నేత సీఎం సురేష్‌నాయుడు పాత బ‌స్టాండ్ స‌మీపంలోని త‌న అన్నా క్యాంటీన్ వ‌ద్ద నిర‌స‌న దీక్షా శిబిరాల‌ను నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే,  ఇదేంటని ప్రశ్నించాల్సిన వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మ‌ల్లెల లింగారెడ్డి కూడా సీఎం సురేష్‌నాయుడి దీక్షా శిబిరాన్ని సంద‌ర్శించి మ‌ద్దతు ప్రకటించి వెళ్లిపోయారు. 

Advertisement

గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ప్రొద్దుటూరు టికెట్‌ను ప్రవీణ్‌కి ఇస్తామన్నట్టుగా సంకేతాలు అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు చూస్తుంటే మాత్రం ఆయనకు ఎవరూ సహకరించే పరిస్థితులు లేవు. దీనికి కారణం లేకపోలేదు. ప్రవీణ్ వ్యవహారశైలి.. ఎవ్వరినీ లెక్కచేయనితనమేనని తెలుస్తోంది. పోనీ టీడీపీ కీలక నేతలైనా కల్పించుకుని ప్రొద్దుటూరులో పరిస్థితులను సరి చేస్తారా? అంటే అదీ లేదు. ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ముందుగా ఎవరికీ చెప్పే పరిస్థితి లేదు. అధినేత ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆయన జైల్లో ఉండటంతో ఒకరినొకరు డోంట్ కేర్ అనేస్తున్నారని అక్కడి జనం చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరికి వారేగా వ్యవహరిస్తుండటంతో వైసీపీకి ఇక్కడ లైన్ క్లియర్ అవుతోంది.