కిషన్ రెడ్డిపై బీజేపీ నేతల ఫైర్.. రాబోయే పెను తుఫాన్‌కు సంకేతమా?

కిషన్ రెడ్డిపై బీజేపీ నేతల ఫైర్.. రాబోయే పెను తుఫాన్‌కు సంకేతమా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టినప్పటి నుంచి అసలు తెలంగాణలో బీజేపీ ఉందా? లేదా? అనేది తెలియడం లేదు. కనీసం ఓ ప్రెస్ మీట్ లేదు. బీజేపీ తరుఫున చేపడుతున్న కార్యక్రమాలంటూ ఏమీ లేవు. బండి సంజయ్ రాష్ట్ర సారధిగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన బీజేపీ.. ఇప్పుడు అమావాస్య చంద్రుడి మాదిరిగా మారిపోయింది. కనీసం పార్టీ నేతలను కిషన్ రెడ్డి ఎక్కడా హైలైట్ అవనీయడం లేదని టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలోనే గత రాత్రి పదాధికారుల సమావేశం జరిగింది.

ఈ సమావేశం చాలా హాట్ హాట్‌గా నడిచింది. ఈ సమావేశం బీజేపీలో రానున్న పెను తుఫాన్‌ను హెచ్చరిస్తోందని సమాచారం. పలువురు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి ఈ సమావేశంలో గట్టిగా నిలదీశారు. అసలు పార్టీ ఏం చేస్తుందో.. ఎన్నికలను ఎలా ఎదుర్కొంటోందో తమకు అర్థం కావడం లేదని నేతలు పేర్కొన్నారు. పార్టీని నమ్ముకుని నియోజకవర్గాల్లో  డబ్బులు ఖర్చు పెడుతున్నామని.. ఈ తరుణంలో కనీసం పార్టీ ఏం చేస్తోందో కూడా తెలియకుంటే ఎలా అని మండిపడ్డారు. 

ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి వారించే యత్నం చేసినా కూడా నేతలు వినే పరిస్థితి లేకుండా పోయింది. కేవలం ఆఫీసుల్లో మీటింగ్‌లు పెట్టుకుని సరిపెట్టుకుంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ మీటింగ్‌లో ఇలా మాట్లాడటం సరికాదని సూచించిన కిషన్ రెడ్డికి.. బీజేపీ చేరి పదేళ్ళు అవుతుందని.. ఎలా మాట్లాడాలో తనకు తెలియదా? అంటూ కీలక నేత సంకినేని ప్రశ్నించారు. కనీసం ప్రెస్‌మీట్లు పెట్టేందుకు సైతం అనుమతి ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.

నిజానికి బీజేపీ నేతల ఆగ్రహంలోనూ అర్థం ఉంది. కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అసలు పార్టీ ఉనికిలో ఉందా? లేదా? అనే విషయం కూడా తెలియడం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కీలక నేతలు కూడా ఓటమి పాలవడం ఖాయమనే టాక్ తెలంగాణలో బాగా నడుస్తోంది.

Google News