ఏపీలో తికానా లేదు కానీ.. పొరుగు రాష్ట్రంలో ప్రచారం..

ఏపీలో తికానా లేదు కానీ.. పొరుగురాష్ట్రంలో ప్రచారం..

ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటి? అంటే ఉన్నా లేనట్టే అన్న సమాధానమే వస్తుంది. ఆ పార్టీకి ఒక అధ్యక్షుడితో పాటు పలు కీలక పదవుల్లో నేతలు అయితే ఉన్నారు అంతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు చెందిన ఏపీ నేతలు తెలంగాణకు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు శ్రమిస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఏపీ నేతల ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిర నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ సరే కానీ.. ఏపీలో పార్టీకి ప్రాణం పోయడానికి వీళ్లెందుకు శ్రమించడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏపీ పొరుగు జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడం మంచిదే కానీ తమ రాష్ట్రంలో పరిస్థితి ఎందుకు చూసుకోవడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

రాజకీయాల నుంచి తప్పుకున్న ఏపీ నేతలు సైతం తిరిగి పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మరి పార్టీని నిలబెట్టుకునేందుకు ఏమైనా యత్నిస్తు్న్నారా? ఏపీసీసీ పగ్గాలను చేపట్టిన గిడుగు రుద్రరాజు కూడా యాక్టివ్‌గా లేరనే టాక్ నడుస్తోంది. కనీసం ప్రజల్లోకి ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా వెళ్లడం లేదు. నిర్మాణాత్మక కార్యక్రమాలేవీ చేపట్టడం లేదు. పార్టీ ఎంత బలహీనపడినా కూడా కొన్ని నియోజకవర్గాల్లో అయినా అంతో ఇంతో పట్టుంటుంది కదా. వాటిపైనైనా ఫోకస్ చేస్తున్నారా? అంటే అదీ లేదు. ఈసారి కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుస్తుందనేది సందేహమే. ఇలాంటి స్థితిలో ఉన్న పార్టీ నేతలు పొరుగు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.