వలంటీర్ల చుట్టూ ఏపీ రాజకీయం!

వలంటీర్ల చుట్టూ ఏపీ రాజకీయం!

ఏపీలో రాజకీయమంతా ప్రస్తుతం వలంటీర్ల చుట్టే తిరుగుతోంది. ఏపీలో ఎన్నికల విధుల నుంచి వలంటీర్లను తప్పించాలంటూ ఈసీకి ఫిర్యాదు అందింది. దీంతో ఈసీ ఎన్నికల విధుల నుంచి వలంటీర్లను తప్పించేసింది. అలాగే  గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం నుంచి కూడా ఈసీ దూరం పెట్టేసింది. ఈ క్రమంలోనే ఏపీలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అధికార, విపక్షాలకు చెందిన ఏ నేత చూసినా వలంటీర్ గురించే మాట్లాడేస్తున్నారు.

ప్రతి నెలా ఒకటో తేదీన అందాల్సిన పింఛన్ లబ్దిదారులెవరికీ అందలేదు. ఇది టీడీపీ పుణ్యమేనని వైసీపీ ప్రచారం చేస్తోంది. టీడీపీ సైతం ఒకటో తారీఖున వైసీపీ ప్రభుత్వం పెన్షన్ వేయలేకపోయిందని విమర్శించింది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వ అధికారుల ద్వారా పింఛను అందించాలని ఈసీ తెలిపింది. కానీ నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను కొందరిని మంచంతో సహా సచివాలయం ముందు పెట్టారు కొందరు వ్యక్తులు. ఇది కావాలనే వైసీపీ చేస్తోందని టీడీపీ.. చివరకు వృద్ధులకు టీడీపీ ఇలాంటి గతి పట్టించిందని వైసీపీ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.

ఎక్కడ ఏ సభ నిర్వహించినా కూడా పార్టీల అధినేతల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల వరకూ ఆవు కథ మాదిరిగా ఎక్కడ మొదలు పెట్టినా చివరకు పెన్షన్ల మేటర్‌కే వస్తున్నారు. నిజానికి ఈ ఓట్లన్నీ వైసీపీకి పడేవేనని టాక్. ఇంతకాలంగా పెన్షన్ అందుకుంటున్న లబ్దిదారులు మరో పార్టీకి ఓడేయడం కష్టమేనని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అలాంటప్పుడు దీనికోసం ఇంత దుమారం పార్టీలు ఎందుకు రేపుతున్నాయో వారికే తెలియాలి. అసలు ఈ పెన్షన్ల అంశం ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందో.. ఏ పార్టీకి నష్టం తెచ్చి పెడుతుందో.. జనాల మైండ్ సెట్ ఎలా ఉందో తెలియడం లేదు.