ఏపీ జనం ఎవరి పక్షం.. అబివృద్దా.. సంక్షేమమా..!?

ఏపీ జనం ఎవరి పక్షం.. అబివృద్దా.. సంక్షేమమా..!?

ఏపీలో పార్టీలెన్నున్నా.. మెయిన్ వార్ మాత్రం వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వర్సెస్ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అనడంలో సందేహమే లేదు. ఈ సారి ఎన్నికలను చూస్తుంటే జెండా, అజెండాలకు తావే లేదనిపిస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా జనాలు ఏం చూస్తారు? ఏ పార్టీ వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది? అనేదే కదా.. మరి వీరిద్దరిలో మేలు ఎక్కువగా ఎవరి కారణంగా జరుగుతుంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిని నిర్ణయించుకోవడం ఒక అంశమైతే.. ఏపీ ఓటర్లు రెండుగా చీలడమనేది మరో అంశం.

ఎవరు ఎటు..!

ఏపీలో ఓటర్లు సంక్షేమం వర్సెస్ అభివృద్ధి అనే రెండు కారకాలను బేస్ చేసుకుని విడిపోతారనడంలో సందేహమే లేదు. మరి సంక్షేమం దిశగా ఆలోచన చేస్తే తడుముకోకుండా జగన్‌కు ఓటు వేస్తారు. అభివృద్ధి గురించి ఆలోచిస్తే మాత్రం చంద్రబాబుకు ఓటు పడుతుంది. మరి సంక్షేమం గురించి అందరూ ఆలోచిస్తారా? అంటే సమస్యే లేదు. కేవలం లబ్ది పొందిన వారు మాత్రమే ఆలోచిస్తారు. అలాగని లబ్ది పొందిన వ్యక్తుల కన్నా వారిని కుటుంబాల వారీగా విడదీయాలి. లబ్ది పొందిన వారి కుటుంబం కూడా జగన్‌కే ఓటేస్తుందనడంలో సందేహం లేదు.

అంతు చిక్కని పరిస్థితి!

మళ్లీ ఇక్కడ కూడా ఆలోచించాల్సిన విషయమొకటుంది. ఎంత లబ్ది పొందినా కూడా వారి కుటుంబంలో నిరుద్యోగులుంటే వారు వైసీపీకి ఓటేసేందుకు కాస్త ఆలోచిస్తారు. ఇక ఈ విషయం పక్కనబెడితే కాస్త చదువుకున్న వారంతా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తే మాత్రం వారి ఓట్లు టీడీపీకి పడతాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు చెప్పండి.. ఏపీలో జనం ఎవరి పక్షం? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనం ఏ పార్టీ పక్షాన నిలుస్తారు? చెప్పడం చాలా కష్టం. ఈ సారి ఓటరు నాడి ఎవరికీ పెద్దగా అంతు చిక్కడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికలు ఈసారి చాలా టఫ్‌గా జరగబోతున్నాయనడంలో సందేహం లేదు.

ఏం జరుగుతుందో..!!

ఐతే సర్వేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అఖండ విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. కూటమి మాత్రం అధికారం మాదేనని చెబుతోంది. ఇక సభలు, సమావేశాలకు అంటారా.. అన్ని పార్టీలకు ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. దీంతో ఎవరు ఎటు వైపు ఉన్నారు.. అనేది పార్టీల అధిపతులకే అంతు చిక్కడం లేదు. మే -13 న జనాల మూడ్ ఎలా ఉంటుందో కాస్త తెలిస్తే.. ఆ తర్వాత జూన్ – 04 మధ్యాహ్నం కల్లా ఫుల్ క్లారిటీ వచ్చేయనుంది. చూద్దాం ఏం జరుగుతుందో..!!

Google News