మళ్లీ మార్చేస్తామని ఎర్రబెల్లే చెప్పాక ఆగుతుందా..!

మళ్లీ మార్చేస్తామని ఎర్రబెల్లే చెప్పాక ఆగుతుందా..!

ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ తెలంగాణలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ స్థాపన తర్వాత ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే ప్రథమం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడం ఒక దెబ్బ అయితే అప్పటి నుంచి నేతలంతా వరుస బెట్టి కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్లడం మరో దెబ్బ. లోక్‌సభ టికెట్ దక్కించుకున్న తర్వాత కూడా నేతలు గట్టు దాటేశారు. అయితే దీనికంతటికీ కారణాలు విశ్లేషించిన పార్టీకి రెండు కారణాలైతే కనిపించాయి. వాటిలో ఒకటి వాస్తు.. రెండు పార్టీ పేరు మార్పు.

ఇప్పటికే వాస్తు దోషాన్ని బీఆర్ఎస్ సవరించేసింది. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయానికి వాస్తు సరిచేయడంలో భాగంగా ఈశాన్యం వైపు గేటును పూర్తిస్థాయిలో తెరిచారు. గతంలో తెలంగాణ భవన్‌లోకి వాహనాలన్నీ పడమర వాయువ్య దిశలో ఉన్న గేటు ద్వారానే లోపలకు వెళ్లేవి. అయితే వాస్తు దోషాన్ని సవరించాలన్న పండితుల సూచన మేరకు గతంలో ఎప్పుడో కానీ వినియోగించని ఈశాన్యం వైపు గేటును ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ గేటులోంచే నేతల రాకపోకలు సాగుతున్నాయి.

ఇక రెండోది పార్టీ పేరు మార్పు. ఈ విషయమై ఎప్పటి నుంచో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పార్టీ నేతల నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పందనా ఇప్పటి వరకూ రాలేదు. బీఆర్‌ఎ్‌సగా పేరు మార్చాకే తెలంగాణలో అధికారం కోల్పోవడం, రాష్ట్రంలో రోజురోజుకూ పార్టీ గ్రాఫ్‌ పడిపోవడం జరుగుతోందని భావించిన బీఆర్ఎస్ అధిష్టానం ఇక పేరు మార్పునకు పూనుకుందట.  బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మారుస్తామని నేడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌పైనే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ పేరు మార్పు పక్కా అని తేలిపోయింది.

Google News