అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్‌ని ఓడించాలి: సునీత
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలని మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత అన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని.. వీలైతే వైఎస్ జగన్‌ని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి అయితే ఇదే తన లక్ష్యమని సునీత తెలిపారు. తన తండ్రి వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారనేది ఆ భగవంతుడికి.. కడప ప్రజలకు తెలుసన్నారు. కడప ప్రజలందరికీ తెలిసినప్పుడు ఏపీ సీఎం జగన్‌కు కూడా తెలిసే ఉంటుందని లాజిక్ తీశారు సునీత.
వివేకాను ఎవరు హత్య చేశారో.. చేయించిందెవరో అన్ని విషయాలు జగన్‌కి తెలుసన్నారు. అవన్నీ ప్రజలకు చెప్పకపోవడంపై జగన్‌ను సునీత నిలదీశారు. హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత సీఎంగా జగన్‌కు ఉందన్నారు. అసలు ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారని జగన్‌ను ఆమె నిలదీశారు. హత్య కేసులో అవినాష్ ప్రమేయం గురించి తెలిస్తే మరింకేమైనా నిజాలు బయటకు వస్తాయని భయపడుతున్నారా? అని జగన్‌ను సునీత ప్రశ్నించారు.
తనత నేరుగా మాట్లాడాలంటే మీ ఛానల్‌కు వస్తానని.. డిబేట్ చేద్దామని.. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయని సునీత పేర్కొన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎంపీగా పోటీ చేయాలని గతంలో తన తండ్రి కోరుకున్నారన్నారు. ప్రస్తుతం షర్మిల పోటీ చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. గతంలో వైసీపీ కోసం షర్మిల ఎంతగానో కష్టపడిందని సునీత తెలిపారు. అయితే జగన్ జైలు నుంచి బయటకు వచ్చాక షర్మిలకు భయపడి ఆమెను దూరం పెట్టారన్నారన్నారు. అసలు షర్మిలకు రాజకీయ సపోర్ట్ లేకుండా చేసేందుకే వివేకాను హత్య చేసి ఉంటారా? మరేదైనా కారణముందా? వాస్తవాలన్నీ బయటకు రావాలని సునీత తెలిపారు.