జగన్‌పై దాడి.. ఎవరి కుట్ర?

జగన్‌పై దాడి.. ఎవరి కుట్ర?

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై దాడి జరిగింది. శనివారం రాత్రి విజయవాడ శివారు ప్రాంతమైన సింగ్‌నగర్‌ లో ఆయనకు ఎటు నుంచి వచ్చిందో ఏమో కానీ ఒక రాయి వచ్చి ఆయన ముఖంపై తగిలింది. ఇది కావాలని చేసిందా? లేదంటే పొరపాటున జరిగిందా? అనేది మాత్రం తెలియరావడం లేదు. ఇదంతా జగన్ ఆడిస్తున్న నాటకమని విపక్షాలు అంటున్నాయి. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రేనని వైసీపీ నేతలు మండి పడుతున్నారు.

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. జగన్నాటకం మొదలైపోతుందని విపక్షాలు అంటున్నాయి. పక్కాగా ఏదో ఒక దాడి ఆయనపై జరుగుతుందని.. కాదు.. జరిపించుకుంటారని విమర్శిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో కోడికత్తితో దాడి తానే స్వయంగా చేయించుకున్నారని చెబుతున్నాయి. విపక్షాల అనుకూల మీడియా కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతోంది. నాడు – నేడు పేరిట కథనాలను వెలువరిస్తోంది. నాటి కోడికత్తి దాడి.. నేటి రాయి దాడి ఫోటోలతో కథనాలను వండి వార్చుతోంది. 

వైసీపీ అనుకూల మీడియా జగన్‌పై హత్యా యత్నం జరిగిందని అంటోంది. సీఎం జగన్ పక్కకు తిరగడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారపక్షం అంటోంది. జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైందని.. కరెంటు లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని ఈ దాడిని టీడీపీ అధినేత చేయించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ కణతకు కావాలనే గురిపెట్టి సంధించారని అంటోంది. జగన్‌తో పాటు ఆయన పక్కనే నిలుచున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎడమ కంటికి కూడా తగిలి వాచింది. ఇదంతా టీడీపీ కుట్రేనని అంటోంది. మరి ఇది నిజానికి ఎవరైనా కుట్ర పన్ని చేశారా? లేదంటే మరొకటా? అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Google News