ఏపీలోనూ రచ్చ లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..

ఏపీలోనూ రచ్చ లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకూ మరింత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రతి చిన్న దాన్ని కూడా ఇష్యూ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ అంటే చిన్న విషయమేమీ కాదు. దీనికోసం యత్నం జరగుతోందట. ఈ మేరకు యాపిల్ సంస్థ నారా లోకేష్‌కు మెయిల్ ద్వారా విషయాన్ని తెలియజేసిందట. ఇంకేముంది.. రచ్చ స్టార్ట్. ఇది వైసీపీ ప్రభుత్వం పనేనంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుర్తు తెలియని సాఫ్ట్‌వేర్‌లతో నారా లోకేష్ ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ చెయ్యడానికి ప్రయత్నం జరుగుతోందట. ఈ విషయాన్ని నారా లోకేష్ ఫోన్‌కి ఆపిల్ సంస్థ ఈమెయిల్ ద్వారా తెలిపింది. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్, హ్యాంకింగ్‌కి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇది కాస్త పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. తెలంగాణ ఎన్నికల్లో గత ప్రభుత్వం ట్యాపింగ్‌కి పాల్పడి ప్రత్యర్థుల కదలికలను తెలుసుకున్న మాదిరిగానే ఇక్కడ కూడా యత్నం జరుగుతోందని టీడీపీ నేతలు అంటున్నారు.

నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్‌కు యత్నించిన వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతామని టీడీపీ నేతలు అంటున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు సైతం సిద్ధమవుతున్నాయి. తమ ఫోన్లు జగన్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ట్యాప్ చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై తగ్గేదే లేదని.. పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెబుతున్నారు. వైసీపీ విజయంపై నమ్మకం లేకే జగన్ ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.