కేటీఆర్ అడ్డుకున్నా ఆగని జంపింగ్స్..

కేటీఆర్ అడ్డుకున్నా ఆగని జంపింగ్స్..

తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ దూసుకెళుతోంది. విజయం సాధించాక పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి మరింత అనుకూలంగా మారిపోయాయి. అధికార పార్టీలో ఉంటే ఉన్నంత విలువ ప్రతిపక్షంలో ఉండదు కదా.. దీనిని ఆసరాగా చేసుకునే అధికారం కావాలనుకున్న నేతలంతా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలు కొన్ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పంచన చేరిపోయాయి.

ఇక ఇప్పుడు నేతలు సైతం కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నలుగురూ పార్టీని మారుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ నలుగురూ మాత్రం తమ నియోజకవర్గ సమస్యల కోసమే కలిశామని చెబుతున్నారు. అయినా సరే.. లోగుట్టు వేరే ఉందంటున్నారు. నియోజకవర్గ సమస్యలైతే తమ పార్టీ అధిష్టానానికి చెప్పి పర్మిషన్ తీసుకుని వచ్చి కలవొచ్చు కదా అంటున్నారు.

ఇక ఆ నలుగురు నేతలు కలిశారన్న విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమకు తెలియకుండా నేతలెవరూ సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. అయినా నేతలు ఆగడం లేదు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తన భార్య, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డితో కలిసి వెళ్లి రేవంత్‌తో భేటీ అయ్యారు. వీరు పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సునీతకు చేవెళ్ల ఎంపీ టికెట్ ఖాయమైందని టాక్. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది.

Google News