ఫుల్ స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్న పవన్

ఫుల్ స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే వారాహి యాత్రతో జనంలోకి వెళ్లి తన సత్తా ఏంటో చూపించేశారు. ఆ తరువాత పరిణామాల కారణంగా వాటన్నింటికీ కాస్త బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం సీట్ల సర్దుబాటు అంశంతో సహా అన్ని వ్యవహారాలు పూర్తయ్యాయి. జనసేనకు ఎన్ని సీట్లు వెళ్లాయి? ఎక్కడెక్కడి సీట్లను జనసేన తీసుకుందనే విషయాలు అయితే బయటకు రాలేదు. దీనికి కారణం లేకపోలేదు. ఈ రెండు పార్టీలు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈ పొత్తు అంశంలో కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అది వచ్చిన వెంటనే సీట్ల అంశాన్ని సైతం ప్రకటించేస్తారు. అయినే జనసేనకు క్లారిటీ ఉంది కాబట్టి వెంటనే ఇక కార్యాచరణలోకి దిగడమే తరువాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రజల మధ్యకు తిరిగి వెళ్లేందుకు రూట్ మ్యాప్ అంతా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఈ నెల 14 నుంచి 17 వరకూ ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు. పవన్ పర్యటన భీమవరం నుంచి ప్రారంభం కానుంది.

ఇక తన పర్యటనను మూడు భాగాలుగా పవన్ విభజించుకున్నట్టు సమాచారం. మొదటి దశలో పార్టీ ముఖ్య నేతలతో పాటు స్థానిక టీడీపీ నేతలతో పవన్ సమావేశం కానున్నారు. వారందరికీ దిశా నిర్దేశం చేయనున్నారు. రెండో దశలో జనసేన వీరమహిళలతో పవన్ సమావేశం కానున్నారు. మూడో దశ కీలకం. ఈ దశలో సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కించనున్నారు. జనసేన పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలోనూ మూడు సార్లు పర్యటించాలని పవన్ డిసైడ్ అయ్యారట. మొత్తానికి ఫుల్ స్కెచ్‌తో పవన్ రంగంలోకి దిగుతున్నారు.