హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా ఉంచాలి: వైవీ సుబ్బారెడ్డి
ఏపీలో ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ సమయంలో హైలైట్ అవుతున్న అంశాలు.. ఏపీకి ప్రత్యేక హోదా.. ఏపీ రాజధాని అంశాలు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన షర్మిల నియామకం తర్వాత ఆమె ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. ఒక్క ఈ అంశంతో ఆమె అటు తన అన్న, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు బీజేపీని లాక్ చేస్తున్నారు.
ఇదంతా ఇలా ఉంటే తాజాగా వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మనకు రాజధాని కట్టుకునే స్థోమత లేదు కాబట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని రాజధానిగా చేద్దామని చాలా నిజాయితీగా ప్రయత్నించామన్నారు. కానీ దానికి న్యాయపరమైన అడ్డంకులు రావడంతో సాధ్యపడలేదన్నారు.
నిజానికి విశాఖ రాజధాని అయిపోయి ఉంటే మనకు ఈ సమస్య ఉండేదే కాదన్నారు. కానీ ఈ చిక్కుల వలన విశాఖ ఇంకా ఎప్పటికీ రాజధాని అవుతుందో మనకి తెలియదన్నారు. కాబట్టి ఏపీకి రాజధాని సిద్ధమయ్యే వరకూ హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎన్నికల తర్వాత దీన్ని గురించి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.