ఈ సీట్లు జనసేనకు కేటాయించకుంటే టీడీపీ నష్టపోతుంది: హరిరామ జోగయ్య

ఈ సీట్లు జనసేనకు కేటాయించకుంటే టీడీపీ నష్టపోతుంది: హరిరామ జోగయ్య

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల కేటాయింపు ఎలా జరగనుందోనన్న ఆతృత ఇరు పార్టీల్లోనూ ఉందని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అధిక శాతం సీట్లు జనసేనకు కేటాయించకుంటే టీడీపీ నష్టపోవాల్సి ఉంటుందన్నారు. ఏ ఏ స్థానాలను కేటాయించాలో కూడా ఆయన సూచించారు.

రాష్ట్రం మొత్తం 175 స్థానాలు, రెండు మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం ఎలా జరగాలనే చర్చల ఫలితంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజాభీష్టం మేరకు జనసేనకు ఎక్కువ స్థానాలు కేటాయించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ సామాజిక వర్గమైన కాపులు మెండుగా ఉన్నారన్నారు. 90 శాతం కాపులు జనసేన పార్టీని బలపరుస్తున్న విషయాన్ని ఎవరూ కాదనలేరన్నారు. జిల్లాలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు నెగ్గాలన్నా కూడా జనసేన ఓటర్ల సపోర్ట్ లేకుండా నెగ్గలేరన్నది నిర్వివాదాంశమని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని వైసీపీని ఓడించి టీడీపీ – జనసేన కూటమి గెలవాలంటే జనసైనికుల బలమున్న నియోజకవర్గాలన్నీ జనసేనకే కేటాయించడం తప్ప టీడీపీకి మరో మార్గం లేదని హరిరామ జోగయ్య అన్నారు.

హరిరామ జోగయ్య సూచించిన అసెంబ్లీ సీట్లు..

నర్సాపురం, భీమవరం, తాడేపల్లి గూడెం, తణుకు, నిడదవోలు, ఉంగటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, ఉండి

పార్లమెంటు సీట్లు..

నర్సాపురం

పైన పేర్కొన్న సీట్లన్నీ జనసేన దక్కించుకోలేకపోతే జరిగే పర్యవసానం.. వచ్చే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ అనుభవించాల్సి వచ్చే మాట నిజమని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. 

ఈ సీట్లు జనసేనకు కేటాయించకుంటే టీడీపీ నష్టపోతుంది: హరిరామ జోగయ్య