బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు..? త్వరలోనే హస్తినకు కేసీఆర్..!

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు..? త్వరలోనే హస్తినకు కేసీఆర్..!

రాజకీయాలలో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులుండరట. దీనిని తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ నిజం చేస్తోంది. నిన్న మొన్నటి వరకూ బీజేపీ అంటేనే మండిపడిన ఈ పార్టీ ఇప్పుడు అంటకాగడానికి సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందట. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పొత్తు మాటేమో కానీ బ్యాక్ సపోర్ట్ బీజేపీ ఇస్తోందని టాక్ నడిచింది. అది ఎంతవరకు నిజమనేది తెలియలేదు.

అయితే ఈసారి నేరుగానే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగుతున్నాయట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది. దీంతో ఇప్పుడు హస్తం పార్టీని ఎదుర్కోవడం గులాబీ పార్టీకి కష్టంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చేతిలో దారుణ పరాజయాన్ని ఎదుర్కొంటే ఇక తెలంగాణలో మనుగడ సాగించడం కష్టమే అవుతుంది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలని బీఆర్ఎస్ భావిస్తోందని టాక్.

పైగా బీఆర్ఎస్ సమయంలో జరిగిన అవినీతినంతా కాంగ్రెస్ పార్టీ వెలికి తీసి మరీ ఆ పార్టీని ఇరుకునబెడుతోంది. ఈ క్రమంలో పొత్తు లేకుండా తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమని బీఆర్ఎస్ భావిస్తోందట. ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్ త్వరలోనే హస్తినకు పయనం కానున్నారని సమాచారం. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అయ్యి పొత్తుల గురించి చర్చిస్తారని సమాచారం. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే 13 సీట్లు సొంతం చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ అధినేత మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. 

Google News