ప్లేస్, టైం చెప్పాలంటూ జగన్‌కు చంద్రబాబు సవాల్.. సీఎం స్వీకరిస్తారా?

ప్లేస్, టైం చెప్పాలంటూ జగన్‌కు చంద్రబాబు సవాల్.. సీఎం స్వీకరిస్తారా?

ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. వ్యూహాలకు ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నాయి. డైలాగ్స్, పంచ్‌లు, సవాళ్లు – ప్రతిసవాళ్లతో ఏపీలో పొలిటికల్ హీట్ ఊపందుకుంటోంది. వైసీపీ అధినేత జగన్.. సిద్ధం పేరిట సభలను ఫుల్ జోష్‌తో నిర్వహిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబును ఏకి పారేస్తున్నారు. కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. ఇక చంద్రబాబు అప్‌డేట్ అయిపోయి మరీ పంచ్ డైలాగ్స్ పేలుస్తున్నారు. ‘రా.. కదలిరా’ పేరిట సభలు నిర్వహిస్తూ వైసీపీ పాలనతో పాటు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. ప్రస్తుతం అది ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా చంద్రబాబు ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ‘‘సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి.. విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేసి.. ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డి? నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.  ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్‌ను విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుంది. బూటకపు ప్రసంగాలు కాదు.. అభివృద్ది పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్, టైం… నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా…. దేనిమీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ!’’ అంటూ సవాల్ విసిరారు.

నిజానికి రాజకీయాల్లో ఇలాంటి సవాళ్లు సర్వసాధారణం. రాజకీయ నేతలు వీటిని లైట్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇలా రోజుకో నేత సవాల్ విసురుతూనే ఉంటారు. వాటిని సీరియస్‌గా తీసుకుని పరుగులు తీస్తే కష్టం. కానీ కొన్ని మాత్రం హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. అలాంటిదే చంద్రబాబు ట్వీట్. దీనికి జగన్ స్పందించవచ్చు.. స్పందించకపోవచ్చు. ఒకవేళ జగన్ రియాక్ట్ అయ్యి.. ఒకే అనేసి టైమ్, ప్లేస్ చెబితే మాత్రం ఇది దేశం దృష్టిని ఆకర్షిస్తుందనడంలో సందేహమే లేదు. కానీ అలా జరగడం కష్టం. కాబట్టి జగన్ దీనిని లైట్ తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. 

Google News