కాంగ్రెస్‌లోకి కేసీఆర్ నమ్మిన బంటు?

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయం..

బీఆర్ఎస్ తెలంగాణలో చాలా ఏళ్ల పాటు తిరుగులేని పార్టీగా కొనసాగింది. ఉద్యమ సమయంలో ఎన్ని సార్లు పార్టీ నేతలు రిజైన్ చేసినా కూడా వారిని ప్రజలు గెలిపించారు. ఇక తెలంగాణ వచ్చిన అనంతరం కూడా బీఆర్ఎస్ హవా కొనసాగింది. దశాబ్ద కాలం పాటు తిరుగులేని మెజారిటీతో ప్రజలు ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు ఆ పార్టీ తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ పూర్తి స్థాయిలో నేలకొరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో అంతో ఇంతో సత్తా చాటితే ఓకే.. లేదంటే సరే సరి..

పార్టీ నుంచి రోజుకు కొందరు చొప్పున నిష్క్రమిస్తున్నారు. కీలకమనుకున్న నేతలంతా వరుసబెట్టి పార్టీ మారుతున్నారు. మరోవైపు మునిసిపాలిటీలన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడిపోతున్నాయి. ఇక ఇప్పుడు కేసీఆర్‌కు నమ్మిన బంటుగా.. కుడి భుజంగా ఉన్న కే కేశవరావు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నారట. పార్టీకి ఏ సమస్య వచ్చినా కూడా కేశవరావు మీడియా ముందుకు వచ్చేవారు. పార్టీకి కవచంలా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కూతురు గద్వాల్ విజయలక్ష్మిని బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ మేయర్‌ని చేసింది.

ఇప్పుడు విజయలక్ష్మే ముందుగా పార్టీ మారతారట. ఆ తరువాత కేశవరావు కూడా జంప్ చేస్తారట. మొత్తానికి బీఆర్ఎస్‌కు పెద్ద చిక్కే వచ్చి పడింది. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతోనే అంతా విస్తుబోయారు. ఎలాంటి పార్టీ ఎలాంటి స్థితికి చేరిందని అంతా అవాక్కయ్యారు. ఇప్పుడు వామపక్షాలతోనూ పొత్తుకు బీఆర్ఎస్ యత్నిస్తోంది. పొత్తు పెట్టుకోకుంటే ఈసారి పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తోంది. ఈక్రమంలోనే చిన్నా చితకా అనేది లేకుండా కలిసి వచ్చిన ప్రతి పార్టీని బీఆర్ఎస్ ఆహ్వానిస్తోంది.