ఇటు ఒక్కడు.. అటు పెద్ద సైన్యమే.. పోరాడగలరా?

ఇటు ఒక్కడు.. అటు పెద్ద సైన్యమే.. పోరాడగలరా?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా శక్తులు ఏకమయ్యాయి. మరి జగన్ తట్టుకుని నిలబడగలరా? ఇటు ఒక్కరు.. చుట్టూ శత్రువులే. ఏపీలో పరిణామాలు చూస్తుంటే ఓ మంచి యాక్షన్ సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇంటి నుంచి ఇద్దరు సోదరీమణులు ఆయనకు శత్రువులుగా మారి తమ సోదరుడు జగన్‌తో పాటు వైసీపీకి ఓటేయవద్దని గట్టిగానే చెబుతున్నారు.

మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ మూడూ ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కానీ… వామపక్షాలు కానీ జగన్‌తో కలిసొచ్చేలా కనిపించడం లేదు. పైగా పార్టీలో ఇన్‌చార్జుల మార్పు అంశం కాస్త ఇబ్బందికర పరిణామాలనే తీసుకొచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే చాలా మంది నేతలు పార్టీలు మారారు. కొన్ని చోట్ల ఇన్‌చార్జులను దాదాపు మూడు సార్లు మారుస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మార్చేసి గంజి చిరంజీవిని.. ఇప్పుడు ఆయన్ను కూడా మార్చేశారు.

ఇలా మార్చుకుంటూ పోవడం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సీటు చేతిలో పెట్టి లాగేస్తే ఎవరికైనా మనసు చివుక్కుమంటుంది. వారు పార్టీ విజయం కోసం శ్రమించడం కష్టమే. ఇలాంటి పరిణామాలను దాటుకుని వైసీపీ అధినేత జగన్ పార్టీని విజయపథంలో ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సంక్షేమ పథకాలు ఏమాత్రం సత్ఫలితాలను ఇస్తాయో చూడాలి. మొత్తానికి ఇటు జగన్ ఒక్కరు.. అటు పెద్ద సైన్యమే ఉంది. జగన్ పోరాడగలరో లేదో అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.