Chandrababu: చంద్రబాబును వీడని కేసులు.. ఇంకెన్ని బయటకు వస్తాయో..!

చంద్రబాబును వీడని కేసులు.. ఇంకెన్ని బయటకు వస్తాయో..!

టీడీపీ అధినేతకు ఒక్క కేసులో బెయిల్ రాగానే తెలుగు తమ్ముళ్లు కేసులన్నీ కొట్టేసినంతగా ఆనందపడిపోతున్నారు. మరోవైపు చంద్రబాబు పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ఎప్పుడు ఏ కేసు తనపై పడుతుందో తెలియని అయోమయంలో ఉన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అకృత్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతానికి మూడు కేసులే కానీ మున్ముందు చాలా పడతాయని టాక్. ఇంకా ఆయన అవినీతి బాగోతాలు ఎన్ని ఉన్నాయో.. ఏమేం బయటకు వస్తాయో తెలియని పరిస్థితి.

35 రోజుల పాటు పోరాడితే ఒక్క కేసులో బెయిల్ దొరికింది. మిగిలిన కేసుల్లో బెయిల్ దొరకాలంటే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందో చూడాలి. ఇక ఈ మూడు కాకుండా మరికొన్ని కేసులు మీద పడితే పరిస్థితి ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అంగళ్లు కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. కేవలం బెయిల్ మాత్రమే వచ్చింది. అంతేకానీ ఈ కేసులో ఊరట అయితే లభించలేదు. ప్రస్తుతం స్కిల్ కేసులో రిమాండ్‌లో ఉన్నారు.

స్కిల్ కేసులో బయటకు వచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. దీంతో ఆయన ఆరోగ్యం బాగోలేదంటూ టీడీపీ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు కొత్త ప్రచారం ప్రారంభించారు. మరోవైపు ఫైబర్ నెట్ కేసు సిద్ధంగా ఉంది. కేవలం అరెస్ట్ చేయకుండా ఆపమని మాత్రమే సుప్రీం తెలిపింది. మొత్తానికి రిమాండ్ ముగిసి.. చంద్రబాబు బయటకు వచ్చినా మరోమారు అరస్టయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.