పవన్ కోసం రంగంలోకి చిరు.. గెలుస్తాడా..!?
అవును.. తమ్ముడు కోసం అన్నయ్య రంగంలోకి దిగిపోయారు. తమ్ముడికి అవసరమైతే తప్పక సపోర్ట్ చేస్తానని గతంలో ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. చెప్పినట్టుగానే ఇప్పుడు తన తమ్ముడి కోసం చిరు రంగంలోకి దిగారు. ముందైతే నేరుగా పిఠాపురం వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం చేస్తారని అంతా భావించారు. అలా చేయలేకపోయినప్పటికీ తన తమ్ముడి కోసం ఒక వీడియో సందేశాన్ని చిరు విడుదల చేశారు. అసలు పవన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు..? ఆయనను ఎందుకు గెలిపించాలి..? వంటి విషయాలను వీడియోలు చిరు వివరించారు. అసలు చిరు ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం.
తల్లికి అన్నయ్య ఏం చెప్పాడంటే..
‘‘కొణిదెల పవన్ కల్యాణ్.. అమ్మ కడుపులో ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మేలు చేయాలి.. మంచి చేయాలి అనే విషయంలో మాత్రం ముందుంటాడు. తన గురించి కంటే జనం గురించే ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు పవన్ కల్యాణ్‌ది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ఏదైనా చేయాలని అనుకుంటారు కానీ కల్యాణ్ మాత్రం తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చుపెట్టడం.. సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి కాపాడే జవానులకు పెద్ద మొత్తం అందివ్వడం.. అలాగే మత్స్యకారులకు ఇలా ఎందరికో చేసిన సాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడే కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లోకి అయిష్టంగానే వచ్చాడు కానీ.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికి అయినా కొడుకు కష్టపడుతుంటే గుండె తరక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న తన తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు.. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం.. వారి బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది.. మన బాధ కంటే అది ఎంతో గొప్పది’’ అని తల్లికి వివరించినట్టుగా చిరు తెలిపారు.
జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే..
‘‘అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే వాళ్లతోనే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి.. జనం కోసం జనసైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకింతం చేసిన శక్తి పవన్. ప్రజల కోసం.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆ శక్తిని వినియోగించాలంటే.. చట్ట సభల్లో ఆ గొంతు మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు.. కల్యాణ్‌ను గెలిపించాలి. మీకు సేవకుడిగా.. సైనికుడిగా అండగా నిలబడతాడు.. మీకోసం ఏమైనా సరే కలబడతాడు.. మీ కలను నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం.. గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి పవన్ కల్యాణ్‌ను గెలిపించండి’’ అని ఓటర్లను చిరు అర్థించారు.