పిఠాపురంలో వాలిపోయిన టాలీవుడ్.. పవన్‌ను గెలిపిస్తారా?

పిఠాపురంలో వాలిపోయిన టాలీవుడ్.. పవన్‌ను గెలిపిస్తారా?

గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు ప్రాంతాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. ఈసారి మాత్రం ఒక్క చోటు నుంచే బరిలోకి దిగారు. అదే పిఠాపురం. ఈసారి ఆయన ఎలాగైనా మంచి మెజారిటీతో గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పూర్తిగా పిఠాపురంలోనే మకాం వేశారు. అన్ని వర్గాలను కూడగడుతూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. కాబట్టి కాపుల ఓట్లన్నీ జనసేనకే పడతాయని భావిస్తున్నారు.

ఈలోపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రివర్స్ అవడమే కాకుండా.. వైసీపీలో జాయిన్ అవడం కొంత పార్టీకి నష్టం చేకూర్చే అంశమే. నిజానికి ముద్రగడ జనసేనలో చేరుదామనుకున్నారు కానీ చేరలేదు. మరి ఆయన కారణంగా పిఠాపురంలో జనసేనకు దెబ్బ పడుతుందో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం పవన్‌ను ఓడించాలనే ధృడ సంకల్పంతోనే ఉన్నారు. మరోవైపు వైసీపీ కూడా అక్కడ వంగా గీతను బరిలోకి దింపింది. ఆమె కూడా అన్ని వర్గాలను కలుపుకుంటూ దూసుకెళుతున్నారు. ఇద్దరికీ సానుకూల వాతావరణమే ఉంది. ఇద్దరికీ గెలుపోటములు సమానంగానే కనిపిస్తున్నాయి.

ఈ తరుణంలో పవన్ తరుఫున సినీ ఇండస్ట్రీ రంగంలోకి దిగింది. జూనియర్ మొదలుకుని సీనియర్ హీరోల వరకూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్‌ను గెలిపించాలంటూ వీడియో సందేశం ద్వారా తెలిపారు. ఇక మరోవైపు జబర్దస్త్ నుంచి కొందరు కమెడియన్స్‌ సైతం పవన్ విజయం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. మరి వీళ్లంతా పవన్  కల్యాణ్‌ను గెలిపిస్తారా..? పవన్ బలవంతుడైతే వీళ్లంతా ఇంత  రచ్చ చేయాల్సిన  అవసరమేంటి..? ఒక్క మహిళ వర్సెస్ ఇంతమంది టీవీ, సినిమా నటులా? ఆఖరికి చిరంజీవి కూడా పవన్‌కు మద్దతుగా నిలిచారు. పోనీ ఈసారైనా గెలిచి పవన్ అసెంబ్లీ గేటు తాకుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అసెంబ్లీ కాదు కదా.. గేటు కూడా తాకనివ్వబోమని వైసీపీ చెబుతోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..!