ఫైబర్‌నెట్ స్కామ్ మాస్టర్‌మైండ్ చంద్రబాబే.. చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీఐడీ
తాను ఏ స్కాంలు చేయలేదని టీడీపీ అధినేత బల్ల గుద్ది చెప్పినా కూడా ఆదారాలతో సహా దొరికిపోతూనే ఉన్నారు. అస్మదీయులకు ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచిపెట్టిన ఘనుడు చంద్రబాబు అని పదే పదే నిరూపితమవుతూనే ఉంది. ఫైబర్ నెట్ ప్రాజెక్టును కేంద్ర నిధులతో చేపట్టడం జరిగింది. దీనిని చంద్రబాబు తన అస్మదీయుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధులు దోపిడీకి తెరదీశారు. మొత్తానికి చంద్రబాబుపై సీఐడీ కొరఢా ఝళిపించింది. ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శుక్రవారం చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇక ఆ చార్జిషీట్‌లో ఏ1గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ3గా ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్, ఇన్‌క్యాప్ సంస్థలకు అప్పటి ఎండీ కోగంంటి సాంబశివరావు( ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా ఉన్నారు)లతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక‌్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక‌్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసులు నమోదు చేసింది. అంతేకాకుండా.. ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్ పేరుతో చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందనే విషయాన్ని సీఐడీ తన చార్జ్‌షీట్‌లో సవివరంగా వివరించింది.
ముందే నిర్ణయించుకుని పక్కాగా కథ నడిపారు..
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్‌ను కట్టబెట్టి తను అనుకున్నది సాధించారు. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు బరితెగించారు. తన హయాంలో కీలక శాఖలైన విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖలను చంద్రబాబు తన వద్దే పెట్టుకున్నారు. దీంతో ఆయన పని మరింత సులభమైంది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ను ఐటీ శాఖ చేపట్టాల్సి ఉంది. కానీ విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా ఆ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని ఆయనే స్వయంగా ఆదేశించారు. అంతేకాదు.. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా.. చంద్రబాబు తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకుని పక్కాగా కథ నడిపారు. దాని కోసం ముందుగా హరికృష్ణ ప్రసాద్‌ను ఏపీ ఈ-గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యునిగా చేర్చారు. నిజానికి నేర చరిత్ర ఉన్న వారికి అలాంటి కీలక పొజిషన్స్ ఇవ్వరు కానీ హరికృష్ణ ప్రసాద్‌ను అంతటి కీలక స్థానంలో నియమించడం ఆశ్చర్యానికి గురి చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని ఫైబర్‌నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. అయితే ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వారు టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదన్నది నిబంధన సైతం ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు ఉల్లంఘించి మరీ హరికృష్ణ నియామకం చేపట్టారు.
అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ..
ఇక ఆ తరువాత ప్రాజెక్ట్ విలువను ఇష్టానుసారంగా పెంచాలని నిర్ణయించారు. కనీసం మార్కెట్ సర్వే కూడా చేపట్టకుండానే.. ప్రాజెక్ట్ కోసం అవసరమైన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతంగా పెంచేశారు. వేమూరి హరికృష్ణ, ఫైబర్ నెట్ కార్పొరేషన్ అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావు ఈ తతంగంలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత టెంటర్ల ప్రక్రియ. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ప్రక్రియ చేపట్టేనాటికే టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈపోస్ యంత్రాల సరఫరాలో ఈ కంపెనీ విఫలమవడంత ప్రభుత్వం దీనిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అయితే చంద్రబాబుకు ఈ విషయాలేమీ పట్టలేదు. ఏకపక్షంగా కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టేశారు. దీంతో పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా సరే.. చంద్రబాబు పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా ప్రకటించేసి.. టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని బి.సుందర్ అనే అధికారి పట్టుబట్టారు. ఆయనను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత కూడా టేరాసాఫ్ట్ కంపెనీ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకుగాను వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు.
కథ మొత్తం అలా నడిపించారు..
స్వతహాగానే ఈ ప్రాజెక్టును సైతం అమలు చేయడంలో టెరాసాఫ్ట్ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు వదిలింది. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. ఇది చాలదన్నట్టు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ మొత్తం నడిచింది. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పీ అనే మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్‌వాయిస్‌లతో ఆ నిధులను కొల్లగొట్టి, కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది.
ఐబీఐ గ్రూప్ ఆడిటింగ్‌లో అవినీతి బట్టబయలు..
ఫైబర్‌నెట్ కుంభకోణంపై కేసుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ సీఐడీ అధికారులు సేకరించారు. ముందుగా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ ఎంత అడ్డగోలుగా వ్యవహరించిందో తేలింది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలంగా వ్యవమరించారని వారు సెక‌్షన్ 164 సీఆర్‌పీసీ ప్రకారం న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.