టీడీపీ, జనసేనల మధ్య సీట్ల క్లారిటీ.. ఆ రెండు సీట్ల విషయంలో రచ్చ..

టీడీపీ, జనసేనల మధ్య సీట్ల క్లారిటీ.. ఆ రెండు సీట్ల విషయంలో రచ్చ..

టీడీపీ, జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. చాలా రోజులుగా అధినేతల సంగతేమో కానీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏ ఏ సీట్లు జనసేనకు వెళతాయా? అని చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ ఉత్కంఠకు నిన్నటితో తెరపడింది. నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌తో గంటన్నర పాటు భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రెండు సీట్లు మినహా మిగిలిన పంపకమంతా పూర్తి చేశారు. రెండు సీట్ల విషయంలో మాత్రం తర్జన భర్జన కొనసాగుతోంది.

సీట్ల పంపకంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే జనసేనకు సీట్లు ఎక్కువగా పోయాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 6, తూర్పుగోదావరిలో 5 సీట్ల చొప్పున జనసేన తీసుకుంది. ఇక విశాఖలో 4, కృష్ణాలో 2, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కటి చొప్పున సీట్లు జనసేనకు వెళ్లాయి. ఇక పెందుర్తి, అమలాపురం స్థానాలపై కొంత సందిగ్ధం నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ రెండు స్థానాలను బలంగా టీడీపీ నేతలు కోరుతున్నారు.

విశాఖ జిల్లా పెందుర్తి సీటుకు బదులు మాడుగుల సీటును జనసేనకు ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు పెందుర్తి స్థానంపై పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నిన్న చంద్రబాబును కలిశారు. ఇక అమలాపురం సీటును జనసేనకు కేటాయించారు కానీ పి.గన్నవరంలో ఆ పార్టీకి స్ట్రాంగ్ అభ్యర్థి ఉండటంతో దానిని తమకిచ్చి అమలాపురం తీసుకోవాలని జనసేనాని కోరుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Google News